Begin typing your search above and press return to search.

మాజీ హీరోయిన్ వర్సెస్ జేడీఎస్..మాటల యుద్ధం!

By:  Tupaki Desk   |   8 March 2019 10:37 AM GMT
మాజీ హీరోయిన్ వర్సెస్ జేడీఎస్..మాటల యుద్ధం!
X
భర్త అంబరీష్ మరణంతో ఆయన స్థానంలో కన్నడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న నటి సుమలతపై అక్కడి రాజకీయ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే సుమలత ఆశిస్తున్న మండ్య ఎంపీ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపించింది. ఆమెకు టికెట్ ఇవ్వమని అనకుండా..ఆ సీటును పొత్తులో భాగంగా జేడీఎస్ కు ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ తేల్చేసింది. అలా సుమలతకు పొగబెట్టింది కాంగ్రెస్ పార్టీ.

అయితే సుమలత వెనక్కు తగ్గడం లేదు.కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వని పక్షంలో ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు కూడా. మండ్య ప్రాంతం అంబరీష్ కు అత్యంత అనుకూల ప్రాంతం. మండ్య మొనగాడు అని పేరు ఆ స్టార్ హీరోకి. కుల సమీకరణాలు కూడా ఆయనకు అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో సుమలత బరిలోకి దిగితే.. అటు అంబరీష్ ఇమేజ్ - ఇటు సానుభూతి ఓట్లను వర్షించే అవకాశం ఉంది.

ఇదే ఇప్పుడు ఆ సీట్లో పోటీ విషయంలో జేడీఎస్ ను ఇబ్బంది పెడుతోంది. అందులోనూ ఈ సారి ఆ సీటు నుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సుమలతపై విరుచుకుపడుతున్నారు మండ్య ప్రాంత జేడీఎస్ నేతలు. ఆ బాధ్యతను తీసుకున్న మంత్రి తమ్మణ్ణ సుమలతపై వాగ్బాణాలను సంధించారు.

అటు అంబరీష్ ను కించపరుస్తూ.. ఇటు సుమలతపై ఎద్దేవా చేస్తూ ఆ జేడీఎస్ నేత రెచ్చిపోయారు. ఇప్పుడు మండ్య ప్రాంతం గుర్తుకు వచ్చిందా? అంటూ సుమలతను ఎద్దేవా చేశారాయన. మొహానికి రంగులు వేసుకునే వాళ్లు.. అంటూ అటు అంబరీష్ ను - ఇటు సుమలతను విమర్శించారాయన. గతంలో అంబరీష్ మంత్రిగా ఉన్నప్పుడు మండ్యకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరో కొంతమంది నాలుగు బస్సులు వేసుకుని బెంగళూరు వెళ్లి సుమలతను కలిసి రాజకీయాల్లోకి రమ్మన్నంత మాత్రాన.. మండ్య ప్రాంతం అంతా ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానించినట్టు కాదని తమ్మణ్ణ అన్నారు.

మంత్రి విమర్శల నేపథ్యంలో సుమలత సమాధానం ఇచ్చారు. అంబరీష్ ఉన్న రోజుల్లో ఎవరెవరు ఏయే పనుల కోసం ఆయన చుట్టూ తిరిగారో తనకు తెలుసు అని, ఇప్పుడు వారే సంస్కార రహితంగా మాట్లాడుతూ ఉన్నారని ఆమె అన్నారు.

వారిని తాము గతంలో ఆదరించామని - ఇప్పుడు కుసంస్కారంగా మాట్లాడుతూ ఉన్నారని అన్నారు. తమను మొహానికి రంగులు వేసుకునే వాళ్లు అని జేడీఎస్ నేత ఎద్దేవా చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. కుమారస్వామి తనయుడు నిఖిల్ మొహానికి రంగులు వేసుకోలేదా? అని ప్రశ్నించారు. కుమారస్వామి కూడా చాలా సంవత్సరాలు సినీ పరిశ్రమలో పని చేసిన వ్యక్తి కాదా? అని సుమలత జేడీఎస్ నేతకు కౌంటర్ ఇచ్చారు.