Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల‌కు సుమ‌ల‌త రెఢీ?

By:  Tupaki Desk   |   14 Jan 2019 6:35 AM GMT
రాజ‌కీయాల‌కు సుమ‌ల‌త రెఢీ?
X
సౌత్ సినిమాల్లో న‌టించి.. ప్ర‌ముఖ న‌టిగా రాణించిన సుమ‌ల‌తను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప్ర‌ముఖ న‌టుడు.. శాండ‌ల్ వుడ్ రెబ‌ల్ స్టార్ గా పేరున్న అంబ‌రీష్ స‌తీమ‌ణిగా ఇప్ప‌టివ‌ర‌కూ పోషించిన పాత్ర‌కు భిన్న‌మైన రోల్ ను ఆమె స్వీక‌రించ‌నున్నారా? అంటే అవునన్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అనారోగ్యంతో ఇటీవ‌ల అంబ‌రీశ్ మ‌ర‌ణించిన నేప‌థ్యంలో సంస్మ‌ర‌ణ స‌భ‌ను నిర్వ‌హించారు.

మండ్య‌లో జ‌రిగిన ఈ స‌భ‌కు పార్టీల‌కు అతీతంగా అంబ‌రీశ్ అభిమానులు హాజ‌ర‌య్యారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు వ‌చ్చారు. ఈ స‌భ‌లో మాట్లాడిన వక్త‌లు.. సుమ‌ల‌త‌ను రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరారు. అయితే.. కాంగ్రెస్ త‌ర‌ఫున లేదంటే జేడీఎస్ త‌ర‌ఫున పోటీ చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను తెచ్చారు. సుమ‌ల‌త రాజ‌కీయాల్లోకి రావాల‌న్న‌ప్ర‌తిపాద‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ.. అభిమానుల ఉత్సాహం మిన్నంటింది.

స‌భ‌కు హాజ‌రైన సినీ ప్ర‌ముఖులు సైతం సుమ‌ల‌త‌ను రాజ‌కీయాల్లోకి రావాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని కోరారు. ఒక‌వేళ ఏ పార్టీలోకి చేర‌టం ఇష్టం లేకుంటే.. ఇండిపెండెంట్ గా పోటీ చేయాల‌ని.. ఆమెను గెలిపించే బాధ్య‌త త‌మ‌దిగా నినాదాలు చేశారు. అంబ‌రీశ్ సుమ‌ల‌త కుమారుడు క‌మ్ సినీ న‌టుడు అభిషేక్ సైతం అమ్మ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న మాట‌ను చెప్పారు.

ఇంత‌మంది ఇన్నిచెప్పినా.. సుమ‌ల‌త మాత్రం త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించ‌లేదు. అభిమానుల ఉత్సాహం.. నినాదాల న‌డుమ మౌనంగా ఉన్నారు. సుమ‌ల‌త తాజా మౌనం ఆమె రాజ‌కీయ ఎంట్రీకి సిగ్న‌ల్ అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే జ‌రిగితే.. క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం కొత్త రూపు సంత‌రించుకునే అవ‌కాశం ఉంది.