Begin typing your search above and press return to search.

అంబ‌రీష్ ప్లేస్ లో సుమ‌ల‌త బ‌రిలోకి..?

By:  Tupaki Desk   |   11 April 2018 5:19 AM GMT
అంబ‌రీష్ ప్లేస్ లో సుమ‌ల‌త బ‌రిలోకి..?
X
అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో క‌ర్ణాట‌క రాష్ట్రమంతా ఇప్పుడు ఎన్నిక‌ల హ‌డావుడిలో బిజీబిజీగా ఉంది. అక్క‌డ రాజ‌కీయం రోజుకో తీరులో మారుతోంది. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీకి.. కాంగ్రెస్ కు కీల‌కంగా మారాయి మోడీ ప్ర‌భ అంత‌కంత‌కూ త‌గ్గుతుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ వ‌చ్చిన ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మోడీ మీద తీవ్రంగా ఉంటాయ‌ని చెబుతున్నారు.

సౌత్ లో పాగా వేయాల‌ని త‌ల‌చే బీజేపీకి.. ఆశ‌లు ఏమైనా ఉన్నాయా? అంటే అది క‌ర్ణాట‌క‌లోనే. గ‌తంలో ఒక‌సారి క‌ర్ణాట‌క ప‌గ్గాల్ని చేప‌ట్టిన బీజేపీ.. మ‌రోసారి అధికారాన్ని సొంతం చేసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. సార్వ‌త్రికానికి ఏడాది ముందు జ‌రుగుతున్న క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపించ‌టం ఖాయ‌మంటున్నారు. మ‌రీ ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల్లో గెలుపు బీజేపీ.. కాంగ్రెస్ రెండు పార్టీల‌కు కీల‌కంగా మార‌నుంది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్ని ప‌లువురు గేమ్ ఛేంజ‌ర్ గా అభివ‌ర్ణిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే.. ఆ పార్టీలో ఆత్మ‌విశ్వాసం రెట్టింపు కావ‌టంతో పాటు.. ఇటీవ‌ల కాలంలో తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప‌వ‌ర్ చేజారుతున్న క్ర‌మానికి అడ్డుక‌ట్ట ప‌డిన‌ట్లు అవుతుంది. అదే స‌మ‌యంలో ఏడాదిలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లపై మ‌రింత ప‌ట్టుద‌ల‌గా స‌మాయుత్తం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఇక‌.. బీజేపీ విష‌యానికి వ‌స్తే.. క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే.. మోడీ గ్రాఫ్ అంత‌కంత‌కూ త‌గ్గిపోతుంద‌న్న మాట‌లో వాస్త‌వం లేద‌ని.. అదంతా ఉత్త‌దేన‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పే వీలు ఉంటుంది. అంతేకాదు.. సౌత్ లో పాగా వేయాల‌న్న తమ క‌ల‌ను నెర‌వేర్చుకున్న‌ట్లు అవుతుంది. సౌత్ మీద మ‌రింత ఫోక‌స్ పెట్ట‌టానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్లు అవుతుంది. ఇలా కీల‌కంగా మారిన క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌ల్లో ప్ర‌తి సీటు కీల‌కంగా మారింది.

ఇలాంటివేళ‌.. కొన్ని స్థానాల్లో బ‌ల‌మైన నేత‌ల‌కు బ‌దులుగా మ‌రొక‌రిని బ‌రిలోకి దింపాల్సి రావ‌టంపై పార్టీలు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. ప్ర‌ముఖ సినీన‌టుడు.. మైసూర్ జిల్లాపై ప్ర‌భావాన్ని చూపే అంబ‌రీష్ కు బ‌దులుగా ఆయ‌న స‌తీమ‌ణి సినీన‌టి సుమ‌ల‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల‌న్న మాట వినిపిస్తోంది. త‌న‌కు బ‌దులుగా త‌న భార్య‌కు టికెట్ ఇవ్వాల‌ని అంబ‌రీష్ స్వ‌యంగా పార్టీ అధినాయ‌కత్వాన్ని కోరిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో త‌న ఆరోగ్యం ఏ మాత్రం బాగోక‌పోవ‌టం.. ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని ప‌రిస్థితుల్లో త‌న‌కు బ‌దులుగా త‌న భార్య‌కు టికెట్ ఇస్తే బాగుంటుంద‌న్న మాట‌నుఆయ‌న పార్టీని కోరిన‌ట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సుమ‌ల‌త కంటే అంబ‌రీష్ కే పార్టీ టికెట్ ఇవ్వ‌టం మంచిద‌న్న అభిప్రాయంలో ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఆయ‌న బ‌రిలో లేకుండా మైసూర్ జిల్లాపై ఆయ‌న కొర‌త ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

అయితే.. త‌న‌కు టికెట్ లేకున్నా.. త‌న భార్య‌కు సంబంధించిన అన్ని అంశాల్ని తాను చూసుకుంటాన‌ని అంబ‌రీష్ స్ప‌ష్టం చేయ‌టంతో పాటు.. మైసూర్ జిల్లా బాధ్య‌త‌ల్ని తాను చేప‌డ‌తాన‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. అంబ‌రీష్ కోరిన‌ట్లుగా ఆయ‌న స‌తీమ‌ణి సుమ‌ల‌త‌కు టికెట్ ఇస్తారా? ఇవ్వ‌రా? అన్న విష‌యం మ‌రో రెండు రోజుల్లో తేలిపోతుంద‌ని చెబుతున్నారు.