Begin typing your search above and press return to search.

ప్రధాని అలాంటి వ్యాధితో బాధపడుతున్నారంట

By:  Tupaki Desk   |   26 Feb 2016 1:43 PM GMT
ప్రధాని అలాంటి వ్యాధితో బాధపడుతున్నారంట
X
ప్రధాని నరేంద్రమోడీ మీద ఘాటైన విమర్శలకు శుక్రవారం లోక్ సభ వేదికగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుల్తాన్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు కమలనాథులకు మంటపుట్టేలా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశాలైన పలు అంశాలపై మోడీ మౌనంగా ఉన్నారని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో తృణమూల్ ఎంపీ మండిపడ్డారు.

రెండు పవర్ సెంటర్ల మధ్య ఇమడలేక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనీ బాబాలా వ్యవహరించేవారని.. మోడీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే తయారైందన్న ఆయన... ‘‘అటు వైపు నాగపూర్ ఆదేశాలు (సంఘ్ పరివార్) అమలు చేయాలో లేక.. ఢిల్లీలోని అధికార యంత్రాంగం మాట వినాలో అర్థం కాక సతమతమవుతున్నారు. అందుకే మౌనాన్ని ఆశ్రయించి ఉండిపోతున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ మౌనీబాబా సిండ్రోమ్ తో బాధ పడుతున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో లోక్ సభలో తాజా వ్యాఖ్యలు చేశారు.

హర్యానాలో ఇటీవల జాట్లు చేపట్టిన ఆందోళన కారణంగా భారీ విధ్వంసానికి పాల్పడ్డారని.. దేశ రాజధానికి 34 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ అల్లర్ల కారణంగా రూ.34 వేల కోట్లు ప్రజాధనం బూడిద అయ్యిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ మధ్య గుజరాత్ లో చోటు చేసుకున్న పటేళ్ల ఉద్యమ సమయంలో ప్రధాని మోడీ మాట్లాడలేదంటూ.. ‘‘ఆయనిప్పుడు మాట్లాడేది ఒకే ఒక్క కార్యక్రమంలో .. అదీ మన్ కీ బాత్ లోనే. అందుకే ప్రజలు సైతం దాన్ని పట్టించుకోవటం మానేశారు’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్ సభలో మోడీపై నేరుగా మాటల దాడి జరగటం గమనార్హం.