Begin typing your search above and press return to search.

పవన్ కోసం రంగంలోకి సుజనా?

By:  Tupaki Desk   |   19 Sept 2016 2:53 PM IST
పవన్ కోసం రంగంలోకి సుజనా?
X
ప్రజలు కోరుకుంటున్నారని చెబుతున్నట్లు - విపక్షాలు బేస్ లెస్ ఆరోపణలు చేస్తున్నట్లు ప్రత్యేక హోదా అంత గొప్పదేమీ కాదని, దానికంటే ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీయే గొప్పదని చెబుతున్నారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. ఈ విషయంపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని చెబుతూ.. పవన్ కల్యాణ్ విమర్శలపై కూడా స్పందించారు.

జనసేన పార్టీ అధ్యక్షులు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు ఈ ప్యాకేజీ గొప్పతనం తెలియడం లేదేమో.. తాము పవన్ ని నేరుగా కలిసి, కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ గురించి, దాని వల్ల రాష్ట్రానికి కలిగే లబ్ధి గురించి వివరిస్తామని సుజనా చౌదరి అన్నారు! అసలు ప్యాకేజీలో ఉన్న గొప్పతనం గురించి తెలిస్తే పవన్ సంతోషపడతారని సుజనా అభిప్రాయపడ్డారు. హోదా అన్న పేరు మాత్రమే లేదు తప్ప.. అంతకుమించిన నిధులే ప్యాకేజీ రూపంలో వచ్చాయని, ఆ విషయాలన్నీ విడమరిచి అర్ధమయ్యేలా చెబితే పవన్ తప్పకుండా అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. వీలైతే పవన్ కి విడమరిచి చెప్పే పనిని తానే స్వయంగా చేస్తానని అన్నారు.

ఇదే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తే ఏదో అద్భుతం జరిగిపోతున్నట్లు విపక్షాలు చెబుతున్నాయని, హోదా ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు రావని.. హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవడం కేవలం భ్రమ మాత్రమే అని సుజనా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగైతే ఉద్యోగాలు అవే వస్తాయని, ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలు ప్యాకేజీ ద్వారా ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే ఒప్పుకుందని ఆయన వెల్లడించారు.