Begin typing your search above and press return to search.

బాబుకు సుజనా సంఘీభావం.. వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 Nov 2021 10:15 AM IST
బాబుకు సుజనా సంఘీభావం.. వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు
X
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు సతీమణి పై అధికార వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాల పై పలువురు తప్పు పడుతున్నారు. పార్టీలకు అతీతం గా బాబు కు మద్దతు పెరుగుతోంది. వ్యక్తి గత ఆరోపణలు.. అందునా రాజకీయ నేతల కుటుంబాల్లోని మహిళల పై దారుణ వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరి కాదన్న అభిప్రాయం అంత కంతకూ ఎక్కువ అవుతోంది. బాబు కుటుంబం గురించి అసెంబ్లీ లో ప్రస్తావించటం ముమ్మాటికి తప్పేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు.

వైసీపీ నేతలు కొందరు విపక్ష నేతను వ్యక్తి గతంగా టార్గెట్ చేసి ఆయన కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడటం.. అలాంటి తీరు ను ప్రోత్సహించటం తప్పే అవుతుందని సుజనా అభిప్రాయ పడ్డారు. రాజకీయాల్లో విమర్శలు విధానాలపై ఉండాలే కానీ అందుకు భిన్నంగా వ్యక్తుల్ని దాటి కుటుంబ సభ్యుల వరకు వెళ్లటం మంచి సంప్రదాయం కాదన్నారు.

ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు సరైనది కాదని.. ఏ పార్టీ వారైనా హద్దులు దాటి.. అసభ్య పదజాలం తో విమర్శలు చేసుకోవటం అత్యున్నత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజా స్వామిక విలువల్ని పతనం చేయటమేనని సుజనా మండి పడ్డారు. వ్యక్తిత్వం లేని నేల బారు నేతల్ని చట్ట సభలకు పంపితే పరిణామాలు ఇలానే ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మన పిల్లల కోసం మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే దిగ జారుడు నేతల్ని దూరం పెట్టాలని లేదంటే భవిష్యత్తు తరాలు రాజకీయ నేతలన్నా.. రాజకీయాల్లోకి రావాలన్నా అసహ్యించుకుంటారన్నారు. పార్టీలకు అతీతం గా నేతలంతా రాజకీయాల్లో విలువల్ని కాపాడేందుకు ప్రయత్నించాలని సుజనా కోరుతున్నారు.