Begin typing your search above and press return to search.

బాబుకు సుజనా మార్కు షాక్..కరకట్ట ఇల్లు ఖాళీ తప్పదా?

By:  Tupaki Desk   |   25 Sep 2019 5:30 PM GMT
బాబుకు సుజనా మార్కు షాక్..కరకట్ట ఇల్లు ఖాళీ తప్పదా?
X
ఇప్పుడంతా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కృష్ణా కరకట్టపై నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ పైనే చర్చ జరుగుతోంది. నిబంధనలకు ప్రముఖ పారిశ్రామికవేత్త విరుద్ధంగా లింగమనేని రమేశ్ కట్టిన లింగమనేని గెస్ట్ హౌస్ ను కూల్చివేసే దిశగా జగన్ సర్కారు కదులుతుంటే... ఆ భవనాన్ని ఎలా కూల్చేస్తారో చూస్తానన్న దిశగా చంద్రబాబు నిజంగానే మంకుపట్టు పట్టిన వాడిలా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ... తాను అద్దెకు ఉంటున్న సదరు భవంతిని ప్రభుత్వం కూల్చివేస్తే... తనకు సానుభూతి అయినా వస్తుందన్న దిశగానూ చంద్రబాబు యోచిస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు కోటరీలో చాలా ముఖ్యుడిగా వ్యవహరించి ఇటీవలే బాబుకు షాకిచ్చి బీజేపీలో చేరిపోయిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన కామెంట్లు ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

అయినా సుజనా ఏంటీ... చంద్రబాబును టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ఏమిటి? అన్న షాకింగ్ కామెంట్లు వినిపిస్తున్నా... ఢిల్లీలో మీడియా ముఖంగా సుజనా స్వయంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తే నిజమేనని ఒప్పుకోవాల్సిందే కదా. సరే... పార్టీ మారిపోయారు కదా... చంద్రబాబును టార్గెట్ చేస్తూ సుజనా కామెంట్లు చేయడంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేకున్నా.. సుజనా కామెంట్లు బాబును బాగానే ఇరుకున పెట్టేశాయని చెప్పక తప్పదు. బాబును అంతలా ఇబ్బంది పెట్టేలా సుజనా ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్న విషయానికి వస్తే...‘ఏదైనా ఒక ఇంట్లో అద్దెకు ఉంటే - అక్కడ నిబంధనల ప్రకారం ఏదైనా కట్టలేదని తెలిస్తే నేను అయితే అలాంటి ఇంట్లో ఉండను. అప్పుడు వారు (చంద్రబాబు) ఉన్నారు. ఇప్పుడు ఖాళీ చేయాలి. దాని గురించి ఇంత చర్చ ఏంటి? ఆ ఇంటిని ప్రభుత్వం గనుక పడగొడితే సానుభూతి వస్తుందని చంద్రబాబు చూస్తున్నారు’ అని సుజనా కాస్తంత కటువైన వ్యాఖ్యలే చేశారు. అంతటితో ఆగని ప్రశ్నించారు.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలగిన సుజనాకు... బాబు వైఖరిపై పూర్తి అవగాహన ఉన్నట్టే లెక్క. ఎందుకంటే... పార్టీలో చంద్రబాబుతో ఏ విషయాన్ని అయినా నేరుగా - ఎలాంటి బెరుకు లేకుండా చర్చించే వెసులుబాటు ఉన్న అతికొద్ది మంది నేతల్లో సుజనా ఒక్కరన్న మాటలో ఎలాంటి డౌటు లేదు కదా. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా... సుజనా - సీఎం రమేశ్ లు అందించే ఆతిథ్యాన్నే స్వీకరించేవారు. వారిద్దరితో కలిసి వారి కారులోనే కొనసాగించే లగ్జరీ జర్నీలు కూడా బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ లెక్కన బాబు మైండ్ ఎలాంటిదన్న విషయంపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా సుజనా చేసిన కామెంట్లతో అయినా చంద్రబాబు కరకట్ట ఇంటిని ఖాళీ చేస్తారో? లేదో? చూడాలి.