Begin typing your search above and press return to search.

సుజనా, అశోక్ బుక్కయిపోయారు

By:  Tupaki Desk   |   1 Aug 2016 9:43 AM GMT
సుజనా, అశోక్ బుక్కయిపోయారు
X
‘‘మీరు ఊ అంటే చాలు.. ఇప్పుడే రాజీనామా చేసేస్తాం... మాకు పదవులు కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం’’ అంటూ చంద్రబాబు ఎదుట పెద్దపెద్ద మాటలు చెప్పారు వారు. ప్రత్యేక హోదా ముందు కేంద్రంలో మంత్రి పదవులు తమకు తృణపాయం అన్నట్లుగా మాట్లాడారు టీడీపీ నేతలు సుజనా చౌదరి - అశోక్ గజపతిరాజులు. తీరా ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేస్తే వీరు అక్కడ కనిపించను కూడా లేదు. ఆ ఛాయలకే రాలేదు. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు జరిపిన సమావేశంలో కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు - సుజనా చౌదరిలు రాజీనామాలకు సిద్ధపడ్డారంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ.. సోమవారం పార్లమెంటులో ధర్నా వద్ద వీరు కనిపించకపోవడంతో రాజీనామా వరకు వెళ్లారన్నది నిజమా కాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామా వరకు వెళ్లినవారయితే ధర్నాకు రావడానికి కూడా ఎందుకు భయపడతారన్న ప్రశ్న వినిపిస్తోంది.

ప్రత్యేకహోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంట్‌ లో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజీనామాలు చేసి పారేస్తామన్న ఇద్దరు మంత్రులు కూడా హాజరవుతారని అంతా అనుకున్నా వారు మాత్రం ఆ ఛాయల్లో కనిపించలేదు. టీడీపీ ఎంపీలు కాసేపు నినాదాలు చేసి మమ అనిపించారు.

కాగా ధర్నా సమయంలో సుజనా పార్లమెంటులో లేరు. అశోక్ మాత్రం పార్లమెంటులోనే ఉన్నారు. అయినా ఆయన ధర్నా పరిసరాలకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటు వద్ద తమ ఎంపీలు ధర్నా చేస్తారని చంద్రబాబు ఆదివారమే ప్రకటించడంతో ఇది పార్టీ ఆమోదంతో ముందే నిర్ణయమైన కార్యక్రమమని అర్థమవుతోంది. అలాంటప్పుడు పార్టీకి చెందిన మంత్రులు హాజరుకాకపోవడం వ్యూహాత్మకమా లేదా వ్యక్తిగతమా అన్నది తెలియాల్సి ఉంది. కేంద్రంలో మంత్రులుగా ఉంటూ వారిద్దరూ హాజరైతే ధర్నా మరింత ప్రభావవంతంగా ఉండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.