Begin typing your search above and press return to search.

నా శవాన్ని ఎవరికీ ఇవ్వకండి .. మీరే కాల్చేయండి సార్ ప్లీజ్.. కన్నీళ్లు పెట్టిస్తోన్న లేఖ !

By:  Tupaki Desk   |   15 Jun 2021 5:33 AM GMT
నా శవాన్ని ఎవరికీ ఇవ్వకండి .. మీరే కాల్చేయండి సార్ ప్లీజ్.. కన్నీళ్లు పెట్టిస్తోన్న లేఖ !
X
కృష్ణా జిల్లా పెనమలూరులో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మహత్యకు ముందు పోలీసులకు ఆయన రాసిన లేఖ ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తోంది. అయ్యా పోలీస్‌ కమిషనర్‌ గారూ యు.సాయిబాబు అనే నేను పటమటలంకలో ఉంటాను. నా అనారోగ్యం, ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. నాకు ఇద్దరు పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. నా భార్య, పిల్లల్ని దిక్కులేని వాళ్లను చేసి వెళ్లిపోతున్నాను. మీకు సహాయం చేయాలనిపిస్తే నా భార్యకు వడ్డీ కట్టే బాధను తగ్గించండి. నా చివరి కోరిక ఏమిటంటే, నా దేహాన్ని బంధువులెవరికీ అప్పగించొద్దు. నా భార్య గాని, అత్తమామలు గాని, అక్కలు, బావలు గాని, ఫ్రెండ్స్ గాని, ఎవరూ అడిగినా నా బాడీ మాత్రం ఇవ్వొద్దు. అనాథ శవం దొరికితే ఎలా కాల్చేస్తారో అలాగే నన్ను కూడా అనాథ అనుకోని కాల్చేయండి.

దానికి వారందరూ పైకి బాధపడినా , మీరు నా శవాన్ని ఇవ్వకుంటే మనసులో చాలా ఆనందపడతారు. ఎందుకంటే ఖర్చు తప్పుతుంది కదా! ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నా చివరి కోరిక తీర్చకపోతే మీరు మీ వృత్తికి ద్రోహం చేసినట్లే. నా చివరికి కోరిక తీరుస్తారని విజయవాడ పోలీస్ డిపార్ట్‌మెంట్ అందరి పాదాలకు దణ్నం పెడుతున్నాను. మీరు నా చివరికి కోరిక తీర్చకపోతే నా చావుకు అర్థమే లేదు. అందుకే ఎవరి ఫోన్ నంబర్ రాయడం లేదు, అంటూ ఓ వ్యక్తి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద కరకట్టపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దంటి సాయిబాబు అనే వ్యక్తి విజయవాడ పటమటలంక పుట్ట రోడ్డులో నివసిస్తుంటాడు. ఆయన అక్కడే ఓ ప్రైవేటు పాఠశాలలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడికి గత కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగుండటం లేదు. తరచూ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒకటి రెండ్రోజుల తర్వాత తిరిగి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన బీసెంట్‌ రోడ్డులోని తన స్నేహితుడి వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకోకపోవడంతో శనివారం సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. అయితే, ఆదివారం ఉదయం పెదపులిపాక వద్ద కరకట్టపై చెట్టుకు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతోందని అతడి భార్య కృష్ణవేణికి తెలియడంతో ఆమె వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా.. అది తన భర్త సాయిబాబుదేనని గుర్తించింది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. మృతుడు సాయిబాబు రాసినట్టుగా అతడి చొక్కా జేబులో నగర పోలీస్‌ కమిషనర్‌కు రాసిన లేఖ లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.