Begin typing your search above and press return to search.

మోడీపై ఆత్మాహుతి దాడి బెదిరింపు

By:  Tupaki Desk   |   23 April 2023 11:50 AM GMT
మోడీపై ఆత్మాహుతి దాడి బెదిరింపు
X
నరేంద్ర మోడీ పై ఆత్మాహుతి దాడి జరుపుతామంటు వచ్చిన బెదిరింపు లేఖ ప్రభుత్వ యంత్రాంగంలో సంచలనంగా మారింది. సోమవారం నుంచి మోడీ రెండు రోజులు కేరళలో పర్యటించబోతున్నారు. తన పర్యటనలో మోడీ అనేక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఈ రెండు రోజుల కార్యక్రమాల్లో ఎక్కడో ఒకచోట మోడీపై ఆత్మాహుతి దాడి చేసి చంపేస్తామంటూ వారం రోజుల క్రితమే కేరళలోని బీజేపీ ఆఫీసుకు బెదిరింపు లేఖ అందింది. దీనిపై వెంటనే స్పందించిన నేతలు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేయటమే కాకుండా బీజేపీ అగ్రనేతల దృష్టికి కూడా తీసుకెళ్లారు. దాంతో ఇటు పార్టీ అటు ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో మోడీ వీవీఐపీ భద్రతా వివరాలు కూడా లీకయ్యాయి. దాంతో ఉన్నతాధికారుల్లో టెన్షన్ బాగా పెరిగిపోయింది. ఎంతో గోప్యంగా ఉండాల్సిన వీవీఐపీల భద్రతా వివరాలు ఎలా బయటకు పొక్కాయో పోలీసు ఉన్నతాధికారులకు, ఎస్పీజీ ఉన్నతాధికారులకు అర్ధంకావట్లేదు.

బీజేపీ ఆఫీసుకు వచ్చిన లేఖపై పోలీసు అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎర్నాకులంకు చెందిన జోసెఫ్ జాన్ నడుముత్తమిల్ పేరుతో లేఖ వచ్చింది. లేఖలో పేర్కొన్న జోసెఫ్ అనే వ్యక్తి ఉన్నాడా లేకపోతే ఇంకేదైనా సంస్ధే సదరు పేరుతో లేఖను పంపిందా అన్నది అర్ధంకావటం లేదు. ఏదేమైనా మోడీ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు తరచూ బయటపడుతున్నాయి. ఆ మధ్య పంజాబ్ పర్యటనలో ఫ్లైఓవర్ పైన వెళుతున్నపుడు హఠాత్తుగా మోడీ కాన్వాయ్ ఆగిపోయింది. ఎందుకంటే కాన్వాయ్ ప్రయాణించే దారిలో అడ్డంగా లారీలను ఉండటమే. ప్రధానమంత్రి ప్రయాణించే రోడ్డుపైన అడ్డంగా లారీలు ఆపటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు.

అసలు ఫ్లైఓవర్ మీదకు లారీలు ఎలావచ్చాయో కూడా తెలీలేదు. పైగా మోడీ కాన్వాయ్ ఐదు నిముషాలకు పైగా ఫ్లైఓవర్ పైనే నిలిచిపోయింది. ఆ సమయంలో దూరంనుండి కూడా మోడీని ఈజీగా టార్గెట్ చేసుండచ్చు. తర్వాత కర్నాటక పర్యటనలో ఉన్నపుడు హఠాత్తుగా మోడీ వాహనం దగ్గరకు ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చేశాడు. ముందు వెనకా అంతమంది సెక్యూరిటీ ఉండగా ఒక వ్యక్తి అందరినీ తప్పించుకుని మోడీ వెహికల్ దగ్గరకు ఎలా చేరుకోగలిగాడో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ నేపధ్యంలోనే ఇపుడు వచ్చిన ఆత్మాహుతి లేఖ కలకలం సృష్టించింది.