Begin typing your search above and press return to search.

కన్నా కోడలి అంత్యక్రియలు పూర్తి ..మిస్టరీగానే మృతి !

By:  Tupaki Desk   |   30 May 2020 6:00 PM IST
కన్నా కోడలి అంత్యక్రియలు పూర్తి ..మిస్టరీగానే మృతి !
X
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ కోడలు ,హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. మీనాక్షి బాంబుస్ విల్లాలో సుహారికతోపాటు కొంత మంది బంధువులు, స్నేహితులు పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. పార్టీలో కొద్ది సేపు డాన్స్ చేసిన సుహారిక.. ఆ తర్వాత ఒకసారిగా కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే సుహారిక మృతి చెందింది. అయితే, సుహారిక మృతి ఘటనలో అసలు ఏం జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

దీనితో సుహారిక మృతిలో ఫోరెన్సిక్‌ నివేదిక కీలకంగా మారింది. దీంతో ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఈ కేసు విచారణలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు సుహారిక నివాసంతో పాటు, ఆమె పార్టీకి వెళ్లిన స్నేహితుల ఇళ్ల పరిశీలన తో పాటుగా పలువురిని ప్రశ్నించనున్నారు. సుహారిక వయస్సు చిన్నదే కావటం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకపోయినా ఆమెకు గుండెపోటుకు దారితీసిన కారణాలపై పోలీసు విచారణ కొనసాగనుంది.

అయితే, ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్‌ రఫీ మీడియాతో మాట్లాడుతూ.. సుహారిక మరణానికి గుండెపోటు కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో కన్నా కుటుంబసభ్యుల సమక్షంలో సుహారిక అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం సుహారిక భౌతికకాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.