Begin typing your search above and press return to search.

కేర‌ళ జ‌ల‌విల‌యం పాపం త‌మిళ‌నాడుదా?

By:  Tupaki Desk   |   24 Aug 2018 10:03 AM GMT
కేర‌ళ జ‌ల‌విల‌యం పాపం త‌మిళ‌నాడుదా?
X
కేర‌ళ‌ను ముంచెత్తిన జ‌ల విల‌యానికి కార‌ణం.. అక్క‌డ కురిసిన భారీ వ‌ర్షాలా? అంటే.. అవున‌ని చెబుతున్నారు చాలామంది. అయితే.. దీని వెనుక మ‌రో కార‌ణం ఉంద‌ని.. అది త‌మిళ‌నాడు స‌ర్కారు చేసిన త‌ప్పుగా చెబుతోంది కేర‌ళ ప్ర‌భుత్వం. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల కార‌ణంగా కేర‌ళ ఫ‌లితాన్ని అనుభ‌వించాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని కేర‌ళ సర్కారే కాదు.. ప‌లువురు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు వెల్ల‌డించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా ఇదే విష‌యంపై కేర‌ళ సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. కేర‌ళలో చోటు చేసుకున్న జ‌ల విల‌యానికి కార‌ణంగా భారీగా కురిసిన వ‌ర్షాలు కాద‌ని.. ఎగువ‌న ఉన్న త‌మిళ‌నాడు త‌న ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు వ‌ద‌ల‌టంతోనే కేర‌ళ మునిగిపోయింద‌ని చెబుతున్నారు.

ఎన్ని వ‌ర్షాలు ప‌డినా.. నీరు స‌ముద్రంలోకి వెళ్లే వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప‌టికీ.. పెద్ద ఎత్తున డ్యాములు నిర్మించి.. నీటిని నిల్వ చేయ‌టం.. నీటి ఇన్ ఫ్లో పెరుగుతున్న కొద్దీ.. ఒక్క‌సారి డ్యాములు ఎత్తేసి నీటిని విడుద‌ల చేయ‌టం కార‌ణంగా దిగువ‌న ఉన్న ప్రాంతాలు జ‌ల ప్ర‌ళ‌యంలో చిక్కుకుంటున్నాయ‌ని చెబుతున్నారు.

ముళ్ల పెరియార్.. ఇడుక్కి డ్యాముల నుంచి విడుద‌లైన నీరు కేర‌ళ‌ను ముంచిన‌ట్లుగా చెబుతున్నారు. కేర‌ళ భూభాగంలోఉండే ముళ్ల పెరియార్ డ్యామ్‌.. హ‌క్కుల‌న్నీ త‌మిళ‌నాడు మీద‌నే ఉంటాయి. నీరు త‌మిళ‌నాడు వాడుకుంటుంది. ఈ ప్రాజెక్టును కేర‌ళ‌లో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. డ్యామ్ పాత‌ది కావ‌టంతో కూల్చివేసి కొత్త డ్యామ్ నిర్మించాల‌ని భావిస్తున్నారు. ఇదే డిమాండ్ ను కేర‌ళ ఎంతో కాలంగా కోరుతోంది. అయితే.. త‌మిళ‌నాడు మాత్రం స‌సేమిరా అంటోంది.

డ్యామ్‌లో నీటి స్థాయి 142 నుంచి 139 అడుగుల‌కు త‌గ్గించాల‌ని కేర‌ళ కోరుతుంటే.. త‌మిళ‌నాడు మాత్రం స‌సేమిరా అంటోంది. వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు 142 అడుగుల మేర ఉన్న నీటిని నిల్వ చేసిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం.. ఆ నీటిని ఒక్క‌సారిగా వ‌దిలేసింది. దీంతో.. ఒక్క‌సారిగా భారీ నీటి ప్ర‌వాహం ఇడుక్కి ఆన‌క‌ట్ట వ‌ద్ద‌కు చేరింది. అది కూడా నిండిపోవ‌టంతో ఒక్క‌సారిగా గేట్లు ఎత్తేశారు.

దీంతో.. ప‌రిస్థితి దిగ‌జారిపోయి.. లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. జ‌రిగిన ఈ ప‌రిణామాల్ని కేర‌ళ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. తాజా ప‌రిణామం కేర‌ళ‌.. త‌మిళ‌నాడుల మ‌ధ్య కొత్త వివాదానికి తెర తీస్తుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడుతో క‌ర్ణాట‌క‌కు బోలెడ‌న్ని నీటి పంచాయితీలు ఉన్నాయి. తాజాగా కేర‌ళ కూడా ఇప్పుడీ వివాదాల గోదాలోకి దిగిన‌ట్లుగా చెప్పాలి.