Begin typing your search above and press return to search.

అమర్ నాథ్ లో ఆకస్మిక బీభత్సం.. భారీ విషాదం.. అసలేం జరిగింది? ఎలా జరిగింది?

By:  Tupaki Desk   |   9 July 2022 5:30 AM GMT
అమర్ నాథ్ లో ఆకస్మిక బీభత్సం.. భారీ విషాదం.. అసలేం జరిగింది? ఎలా జరిగింది?
X
దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని అమర్ నాథ్ క్షేత్రం సమీపంలో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చిపడ్డాయి. దీంతో వరద బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 15కు చేరింది. అమర్ నాథ్ గుహ దిగువ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ లను జారీ చేసింది.

ఆకస్మికంగా వరదల కారణంగా అనేక టెంట్లు కొట్టుకుపోవడంతో 15మందికి పైగా యాత్రికులు మరణించారు. దాదాపు 40 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయారని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. వారి ఆచూకీ కోసం అధికారులు వెతుకుతున్నారు. తీవ్రంగా గాలిస్తున్నారు.

-హైల్ప్ లైన్ నంబర్లు ఇవీ
అమర్ నాథ్ యాత్రికులు హెల్ప్ లైన్ నంబర్లు 011-23438252, 011-23438253 నంబర్లలో సంప్రదించాలని ఎన్డీఆర్ఎఫ్ టీం తెలిపింది. కశ్మీర్ హెల్ప్ లైన్ ను అందుబాటులో ఉంచారు 0194-2496240, 0194-2313149.

-అమర్ నాథ్ లో అసలేం జరిగింది? ఎందుకు జరిగింది?
అమర్ నాథ్ మే నెల నుంచి ప్రారంభం అవుతుంది. వేసవి మొదలుకాగానే మంచు కరిగి కొండలు తేలి ప్రయాణానికి సులువుగా ఉంటుంది. రుతుపవనాలు విస్తరించడానికి సమయం పడుతుంది కాబట్టి కశ్మీర్ వరకూ వచ్చేలోగా ఈ యాత్ర పూర్తవుతుంది.అయితే ఈసారి వేగంగా రుతుపవనాలు రాకతో కశ్మీర్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగానే వచ్చిన ఆకస్మిక వరదల్లో 15మందికి పైగా మరణించారు. కనీసం మూడు లంగర్లు , 25 యాత్రి టెంట్లు కొట్టుకుపోయాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో గుహపై నుంచి పక్కల నుంచి నీరు వచ్చి చేరిందని ఐటీబీపీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

-అమర్ నాథ్ యాత్ర రద్దు
ఆకస్మిక వరదలతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఐటీబీపీ ప్రకటించింది. వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయని.. ప్రమాద స్థాయిని పరిశీలిస్తే.. ఆ ప్రాంతం ముంపునకు గురికావడంతో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం సాధారణంగా ఉండి.. తాత్కాలిక ఏర్పాట్లు చేస్తే శనివారం యాత్రను తిరిగి ప్రారంభించవచ్చని తెలిపారు.

ఇక ఉత్తరాఖండ్ లో వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలున్నారు. నైనీటాల్ లో భారీ వర్షాకలు డేలా నది ఉప్పొంగి వరదలో కారు కొట్టుకుపోయింది.