Begin typing your search above and press return to search.

జగనన్నా... నేనున్నా... ఫూలే  పోలికతో సుచరిత

By:  Tupaki Desk   |   21 Dec 2022 5:00 PM GMT
జగనన్నా... నేనున్నా...  ఫూలే  పోలికతో  సుచరిత
X
వైసీపీలో సీనియర్ నేతగా, మహిళా మంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత తాజాగా జగన్ యాభైవ బర్త్ డే వేళ చేసిన ట్వీట్ అందరికీ ఆకట్టుకుంది. జగన్ని ఏకంగా నవతరం ఫూలే పోలుస్తూ ఆమె సంచలనమే క్రియేట్ చేశారు. అంతే కాదు వైఎస్సార్ కంటే గ్రేట్ అన్నట్లుగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. వైఎసార్ హయాంలో మూడు ట్రిపుల్ ఐటీలు స్థాపిస్తే జగన్ ఏకంగా 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తూ విద్యా రంగంలో విప్లవాలను సృష్టించారు అని కొనియాడారు.

జగన్ పాలన మేలు అంటూ ఆమె చెసిన ట్వీట్ ఇపుడు చర్చకు తావిస్తోంది. ఇదంతా ఎందుకు అంటే ఆమె గత ఎనిమిది నెలలుగా పెద్దగా చురుకుగా పార్టీలో ఉండడం లేదు అని అంటున్నారు. ఆమెను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మంత్రివర్గ విస్తరణలో జగన్ పదవి నుంచి తొలగించారు. నాటి నుంచి ఆమె పార్టీలో అసంతృప్తిగా ఉంటున్నారు.

అంతే కాదు ఆమె తనకు అప్పగించిన జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పదవికి కూడా ఈ మధ్య రాజీనామా చేశారు. ఆమె వేరే పార్టీ వైపుగా వెళ్తారని, ఆమె చూపు ఆలోచనలు వేరేగా ఉంటున్నాయని కూడా చర్చకు వచ్చింది. ఈ సమయంలో ఆమె సడెన్ గా జగన్ని పొగడడం, అది కూడా నవతరం ఫూలే అంటూ చెప్పడం తో చాలా మంది ఆలోచిస్తున్నారు.

మేకతోటి సుచరితను చెల్లెలుగా జగన్ భావించారు. ఆమెను కుటుంబ సభ్యురాలిగానే చూసుకున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణలో తొలగించారు అన్న ఆవేదనతో ఆమె చాన్నాళ్ళుగా దూరంగా ఉండిపోయారు. మరి ఏమి జరిగిందో ఏమో కానీ ఆమె జగన్ ఈజ్ గ్రేట్ అంటున్నారు. అంటే ఆమెకు తత్వం బోధపడింది అని కూడా అంటున్నారు.

వైసీపీలో తన రాజకీయ జీవితం కొనసాగించేందుకు తాను ఉన్నాను పార్టీలోనే ఉంటాను అని బలమైన సంకేతాలు ఇచ్చేందుకు ఆమె జగన్ పుట్టిన రోజు వేడుకలను ఉపయోగించుకున్నారు అని అంటున్న వారూ ఉన్నారు. ఒకే ఒక్క ట్వీట్ తో మేకతోటి సుచరిత చాలా తెలివిగా పార్టీతో అధినాయకత్వంతో ఏమైనా గ్యాప్ ఉంటే అది లేదు అని చెప్పడానికి పార్టీ జనానికీ సాదర జనానికి కూడా సందేశం ఇచ్చేలా చేశారని అంటున్నారు.

మరి చూడాలి దీని తరువాత ఆమె రాజకీయ కార్యకలాపాలు దూకుడు ఎలా ఉంటాయో. వైసీపీ కూడా ఆమె పట్ల ఏ రకమైన వైఖరిని ప్రదర్శిస్తుందో కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. అయితే ఆమె నవతరం ఫూలే అని జగన్ని అభివర్ణించడం మాత్రం మరీ అతిగా ఉందని అంటున్న వారూ ఉన్నారుట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.