Begin typing your search above and press return to search.

వారిపై సుప్రీం కొర‌డా ఝ‌ళిపించిందిగా!

By:  Tupaki Desk   |   11 Sep 2017 1:36 PM GMT
వారిపై సుప్రీం కొర‌డా ఝ‌ళిపించిందిగా!
X
దేశంలో ఎంపీలు - ఎమ్మెల్యేల‌పై అనేక ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అధికారంలోకి రాక ముందు, వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జాప్ర‌తినిధుల ఆస్తుల్లో విప‌రీత‌మైన తేడాలు వ‌స్తున్నాయ‌నేది గ‌త కొన్నేళ్లుగా వినిపిస్తున్న‌మాట‌. ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించే అఫిడ‌విట్ల‌లో పేర్కొంటున్న ఆస్తుల‌కు, ఐదేళ్ల‌య్యేలోపు పోగేసుకుంటున్న ఆస్తుల‌కు పొంతన ఉండ‌డం లేద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. గ‌తంలో ఎంతో మంది ఎంపీలు - ఎమ్మెల్యేల‌పై ఇలాంటి విమ‌ర్శ‌లు - ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అయినా పెద్ద‌గా చ‌ర్య‌లు తీసుకున్న‌ది లేదు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉన్న‌వారిలో చాలా మంది త‌మ వ్య‌క్తిగ‌త ఆస్తుల‌ను పెంచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

అయితే, ఇలాంటి వారిపై తాజాగా దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జా సేవ మ‌రిచి వ్య‌క్తిగ‌త సేవ‌లో త‌రించ‌డాన్ని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టింది. ప్రజాప్రతినిధుల వ్య‌క్తిగ‌త‌ ఆస్తుల పెరుగుదలపై యూపీ రాజ‌ధాని ల‌క్నోకి చెందిన ఎన్‌జీఓ సంస్థ ‘లోక్‌ ప్రహరి’ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. దేశ‌వ్యాప్తంగా మొత్తం 26 మంది లోక్‌ సభ - 11 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 257 మంది శాససనసభ్యుల ప్ర‌స్తుత ఆస్తుల వివరాలను కోర్టుకు అంద‌జేసింది. అదేవిధంగా ఆ ప్రజాప్రతినిధులు ఎన్నికల అఫిడవిట్‌ లో పొందుపరిచిన ఆస్తుల వివ‌రాల‌ను కూడా సుప్రీంకు నివేదించింది.

ఈ పిటిష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీం కోర్టు.. ఏడుగురు ఎంపీలు - 98 మంది వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేల భ‌ర‌తం ప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌జాప్ర‌తినిధుల ఆస్తుల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు(సీబీడీటీ)ని కోర్టు ఆదేశించింది. ద‌ర్యాప్తు జ‌ర‌పాల్సిన ప్ర‌జాప్ర‌తినిధుల పేర్లు వివ‌రాల‌తో కూడిన జాబితాను సీల్డ్ క‌వ‌ర్‌లో సీబీడీటీకి రేపు అందించాల‌ని కోర్టు అధికారుల‌ను ఆదేశించింది. ఎంపీలు - ఎమ్మెల్యేలు గణనీయంగా ఆస్తులు పెంచుకున్నట్లు తేలిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో సీల్డ్‌ క‌వ‌ర్ త‌మ‌కు అంద‌గానే విచార‌ణ‌కు దిగుతామ‌ని సీబీడీటీ వెల్ల‌డించింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.