Begin typing your search above and press return to search.

కంగనకు స్వామి మద్దతు... శివసేనకు కాలిపోయింది

By:  Tupaki Desk   |   9 Sep 2020 5:00 PM GMT
కంగనకు స్వామి మద్దతు... శివసేనకు కాలిపోయింది
X
వివాదాలను కొనితెచ్చుకునేలా వ్యవహరిస్తున్న బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ కు ఇప్పుడు పెద్ద మద్దతే లభించినట్టేనని చెప్పాలి. ఓ వైపు బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఆత్మహత్య, బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం.. వాటిపై కంగన తనదైన శైలి కామెంట్లతో వాతావరణం బాగానే హీటెక్కింది. ఇలాంటి తరుణంలో ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చుతూ కంగన చేసిన కామెంట్లు మరింత వేడి పుట్టించాయి. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు కంగనపై తనదైన శైలి చర్యలకు శ్రీకారం చుట్టింది. బృహన్ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) ఆమె నిర్మిస్తున్న కార్యాలయంలో అక్రమ మార్పులు జరిగాయని ఆరోపిస్తూ, బుధవారం ఉదయం కూల్చివేతలు జరిపింది.

ఈ కూల్చివేతలపై ముంబై హైకోర్టును కంగన ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పిన కోర్టు కూల్చివేతలను నిలిపివేయాలని బీఎంసీని ఆదేశించింది. ఆమె పిటిషన్‌పై సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఏ ఒక్కరూ ఊహించని విధంగా కంగనకు మద్దతుగా నిలిచారు. ఆత్మస్థయిర్యంతో నడచుకోవాలని, ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఓ వైపు ముంబై హైకోర్టు కూల్చివేతలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయగా.. మరోవైపు స్వామి మద్దతు తెలపడంతో కంగనకు మంచి మద్దతే లభించిందని చెప్పక తప్పదు.


ఇక ఈ వ్యవహారంపై కంగన బుధవారం తనదైన రీతి ట్వీట్‌ సంధించింది. ‘‘నా ఇంట్లో ఎటువంటి చట్టవిరుద్ధ నిర్మాణం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం కోవిడ్ సమయంలో కూల్చివేతలను సెప్టెంబరు 30 వరకు నిషేధించింది. బుల్లీవుడ్! ఇప్పుడు దీనిని గమనించు, నియంతృత్వం ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యం చచ్చింది’’ అని మండిపడ్డారు. మొత్తంగా కంగనను టార్గెట్ చేసేలా ముందుకు సాగిన శివసేన సర్కారుకు హైకోర్టు బ్రేకులు వేయగా... కంగనకు మద్దతుగా సుబ్రహ్మణ్య స్వామి నిలవడంతో శివసేన కుతకుతలాడిపోందన్న రీతిలో విశ్లేషణలు సాగుతున్నాయి.