Begin typing your search above and press return to search.

రజనీ, కమల్... గారడీ గాళ్లా?

By:  Tupaki Desk   |   24 Nov 2019 5:20 PM GMT
రజనీ, కమల్... గారడీ గాళ్లా?
X
తమిళ రాజకీయాలను పెను ప్రభావితం చేస్తామంటూ కోలీవుడ్ సినిమా స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ లు తమదైన శైలి వ్యూహాలు రచిస్తున్నారు. నిన్నటిదాకా వేర్వేరుగానే సాగిన ఈ ఇద్దరు స్టార్లు... ఇప్పుడు ఒకే దారిలోకి వచ్చే దిశగా కదులుతున్నారు. తమిళ రాజకీయాల్లో తమ ప్రభావం ఓ రేంజిలో ఉంటుందని వారు భావిస్తున్నా... జనం కూడా అదే భావనతోనే ఉన్నారు. తమిళ సినిమా రంగంలోనే కాకుండా యావత్తు భారత సినీ జగత్తులో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరు నటులు కలిస్తే... కనీసం వారి అభిమాన గళం ఓట్లేసినా తమిళనాట రాజకీయ చరిత్రలో ఓ మైలు రాయి లాంటి తీర్పు వస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వారిద్దరిపై సంచలన కామెంట్లు చేశారు.

రజనీతో పాటు కమల్ ను కూడా గారడీ గాళ్లుగా అభివర్ణించేసిన సుబ్రహ్మణ్యస్వామి... వారిద్దరూ కలిసినా తమిళనాడుకు చేసేదేమీ లేదని, ఇప్పటిదాకా వారిద్దరు రాష్ట్రానికి చేసింది కూడా ఏమీ లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ, కమల్ కలిసినంత మాత్రాన తమిళనాడుకు ఒరిగేదేమీ లేదని పెదవి విరిచారు. త్వరలో విడుదల కాబోతున్న తమ సినిమాల పబ్లిసిటీ కోసమే రజనీకాంత్, కమలహాసన్ కలిసిపోయినట్టుగా విన్యాసాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సినిమా గారడీ వాళ్లు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సుబ్రహ్మణ్యస్వామి నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇఫ్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయాయని చెప్పాలి.