Begin typing your search above and press return to search.

విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు.. బాంబు పేల్చిన సుబ్రహ్మణ్యస్వామి!

By:  Tupaki Desk   |   7 Jan 2021 6:32 AM GMT
విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు.. బాంబు పేల్చిన సుబ్రహ్మణ్యస్వామి!
X
ఆంధ్రప్రదేశ్ లో విగ్రహ రాజకీయాలపై బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయ వ్యయాలను కాగ్ తో ఆడిట్ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించిన తర్వాతే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇదో గొప్ప నిర్ణయమని.. దీంతో కొందరి పునాదులు కదిలిపోతాయనే ఈ దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని అన్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే అక్కసుతోనే కొందరు ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.. కొందరు తెరవెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పారు.

ఏపీలో ఆలయాలపై దాడుల విషయంలో పోలీసులు, జగన్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. వైఎస్ జగన్ ను క్రిస్టియన్ అని విమర్శిస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ తిరుమలలో తెల్లవారుజామున 2 గంటలకు పూజలు చేశారు. కానీ ఆయన దాన్ని తన ప్రచారం కోసం వాడుకోలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదంతా కొందరు చేస్తున్న కుట్ర అని బీజేపీ ఎంపీ ఆరోపించారు. కాంగ్రెస్ తో కలిసిన కొందరు నేడు తమకు అస్సలు ఓన్ చేసుకోలేని హిందుత్వను వేదికగా చేసుకుంటున్నారని మండిపడ్డారు.

టీటీడీలో క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారని.. దీనిపై తాను విచారించానని బీజేపీ ఎంపీ తెలిపారు. టీటీడీలో కేవలం ఏడుగురే అన్య మతస్తులు ఉన్నారు. వారు కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియమితులైన వారు కాదని సుబ్రహ్మణ్యస్వామి వివరించారు. అంతకు ముందు ప్రభుత్వంలో నియమితులైనవారే. వారిని కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోకి బదిలీ చేసిందన్నారు. ఇక ముందు టీటీడీలో హిందూయేతరులను నియమించరాదని విధాన నిర్ణయం కూడా తీసుకున్నారు.ఇంత కఠినంగా ఉంటున్నా జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.