Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీని సుబ్ర‌మ‌ణ్య స్వామి అంత మాట అనేశారేంట‌బ్బా!!

By:  Tupaki Desk   |   23 May 2023 7:00 AM GMT
ప్ర‌ధాని మోడీని సుబ్ర‌మ‌ణ్య స్వామి అంత మాట అనేశారేంట‌బ్బా!!
X
స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంగా వ్య‌వ‌హ‌రించే నాయ‌కుల్లో ముందుంటారు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు, త‌మిళ‌నాడుకు చెందిన సుబ్ర‌మణ్య స్వామి. త‌ర‌చుగా ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉంటారు. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌పై ఆయ‌న ఆంగ్ల ప‌త్రిక‌లు వ్యాసాలు రాస్తూ.. విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతుంటారు. ప్ర‌ధానంగా నోట్ల ర‌ద్దును తీవ్రంగా వ్య‌తిరేకించిన బీజేపీ నాయ‌కుడు ఈయ‌న ఒక్క‌రే కావ‌డం గ‌మ‌నార్హం. అద‌విధంగా క‌రోనా స‌మ‌యంలో ముఖ్యంగా లాక్‌డౌన్ విధించిన‌ప్పుడు వ‌ల‌స కూలీల విష‌యంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.

అంతేకాదు.. సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. వ‌ల‌స కూలీల‌ను కేంద్ర ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌ని వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించారు. అదేవిధంగా క‌రోనా మృతుల లెక్క‌లు చెప్పాల‌ని కూడా అప్ప‌ట్లో విరుచుకుప‌డ్డారు. త‌ర్వాత‌.. క‌రోనాతో మృతి చెందిన వారికి విపత్తు స‌హాయ‌క నిధి నుంచి ప‌రిహారం అందించాలంటూ.. కోర్టుకు వెళ్లి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇదొక్క‌టే కాదు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గొప్ప‌గా చెప్పుకొనే స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌పైనా సుబ్ర‌మ‌ణ్య స్వామి.. గాలి తీసేశారు. ఇవి స‌హ‌జంగా ఏ ప్ర‌భుత్వం ఉన్నా జ‌రిగేవ‌న‌ని వ్యాఖ్యానించి.. సంచ‌ల‌నం సృష్టించారు.

ఇలా.. స్వ‌పక్షంలోనే విప‌క్షంగా ఉండే సుబ్ర‌మ‌ణ్య స్వామి.. తాజాగా ప్ర‌ధాని మోడీని మ‌రింత కార్న‌ర్ చేశారు. ఆయ‌న‌కు ఎన్నిక‌లకు సంబంధించి ఫార‌మ్ పూర్తి చేసే నాలెడ్జ్ లేద‌ని. ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో సంచ‌ల‌న స‌వాల్ కూడా రువ్వారు. ``ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎవ‌రి సాయం లేకుండా.. ఎన్నిక‌ల ఫార‌మ్ నింపితే.. నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటా! `` అని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అంటే.. సుబ్ర‌మ‌ణ్య స్వామి దృష్టిలో మోడీకి ఆ మాత్రం ప‌రిజ్ఞానం లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. కానీ.. మోడీ గురించి .. బీజేపీ నాయ‌కులు మాత్రం ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఆయ‌న బాగా చ‌దువుకున్నార‌ని.. మాస్ట‌ర్ డిగ్రీ కూడా చేశార‌ని చెబుతుంటారు. కానీ, దానికి విరుద్ధంగా సుబ్ర‌మ‌ణ్య స్వామి చేసిన స‌వాల్ రాజ‌కీయంగా మోడీకి సెగ‌పెట్ట‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.