Begin typing your search above and press return to search.

ఏపీ కమలనాథులకు భారీ షాకిచ్చేలా స్వామి వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 May 2020 3:47 AM GMT
ఏపీ కమలనాథులకు భారీ షాకిచ్చేలా స్వామి వ్యాఖ్యలు
X
తన మనసుకు తోచిన రీతిలో తన అభిప్రాయాన్ని ఓపెన్ గా వెల్లడించే బీజేపీ నేతగా సుపరిచితులు సుబ్రమణ్య స్వామి. అంశం ఏదైనా కావొచ్చు. తనకంటూ ఒక అభిప్రాయం ఉంటే మాత్రం వెనుకాముందు లేకుండా ఓపెన్ కావటం స్వామికి అలవాటు. ఈ తీరుతో కమలనాథులకు అప్పుడప్పుడు కరెంటు షాకులు తగులుతుంటాయి. తాజాగా అలాంటి అనుభవమే ఏపీ బీజేపీ నేతలకు ఎదురైంది.

రెండె తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన టీటీడీ భూముల ఎపిసోడ్ ఉదంతం పై స్పందించిన స్వామి.. ఏపీ కమలనాథుల స్టాండ్ కు భిన్నంగా వ్యాఖ్యలు చేసి వారిని ఆత్మరక్షణలో పడేలా చేశారు. టీటీడీ భూముల విషయంలో పొలిటికల్ మైలేజీ కోసం ప్రయత్నిస్తున్న ఏపీ బీజేపీ నేతల గొంతులో నుంచి మాట రాని రీతిలో స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి ఆస్తుల విషయంలో ఏపీ బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ తప్పు పట్టారు.

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన సమయంలో బీజేపీ నేత రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్నారని చెప్పారు. బాబు హయాంలో టీటీడీ భూముల అమ్మకాలపైన ఒక కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీలో ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి కూడా సభ్యుడన్న విషయాన్ని గుర్తు చేశారు.

టీటీడీ భూములు అమ్మాలన్న నిర్ణయం తీసుకున్న వేళ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత ఉన్నారన్నది మర్చిపోకూడదున్నారు. దేవుడి విషయంలో అబద్ధాలు చెప్పటం సరైనది కాదన్న ఆయన.. బాబు హయాంలోనే టీటీడీ ఆస్తుల్ని అమ్మాలన్న నిర్ణయాన్ని అప్పట్లో తీసుకున్న వైనాన్ని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశారు.

మొత్తంగా టీటీడీ భూముల ఎపిసోడ్ లో ఏపీ బీజేపీ నేతలకు షాకిచ్చిన స్వామి.. తన వరకు తాను తిరుమల భూముల అమ్మకాల్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తన బ్రాండ్ ఇమేజ్ కు కించిత్ నష్టం వాటిల్లకుండా ఉండే విషయంలో స్వామి నూటికి నూరుశాతం న్యాయం చేసినా..సొంత పార్టీ నేతల (ఏపీ కమలనాథులకు)కు మాత్రం దిక్కుతోచని స్థితిలో పడేశారని చెప్పక తప్పదు.