Begin typing your search above and press return to search.

అత్యాచార బాబాకు బీజేపీ అగ్ర‌నేత అండ‌

By:  Tupaki Desk   |   10 Nov 2015 8:01 AM GMT
అత్యాచార బాబాకు బీజేపీ అగ్ర‌నేత అండ‌
X
భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కుడు - సుప్ర‌సిద్ధ న్యాయ‌వాది సుబ్రహ్మణ్య స్వామికి వివాదాలు అంటే తెగ మ‌క్కువ‌. స్వామికి-వివాదాల‌కు స‌న్నిహిత సంబంధం ఉంద‌న‌డం అతిశ‌యోక్తి కాదు. స్వ‌త‌హాగా లాయ‌ర్‌ - అందులో డైన‌మిక్ మ‌న‌స్తత్వం...దీంతో స్వామి వారు దూకుడు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. గ‌తంలో రామ‌జ‌న్మ‌భూమి - జ‌య‌ల‌లిత అక్ర‌మాస్తులు - క‌రుణానిధిపై కేసు... వంటి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. తాజాగా మ‌రో వివాదంలో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ ఇవ్వ‌డం ద్వారా స్వామి తెర‌మీద‌కు వ‌చ్చారు.

అత్యాచారం కేసులో అరెస్టయిన ఆధ్యాత్మిక వేత్త ఆశారాంకు బెయిల్‌ ఇప్పించడానికి కోర్టును ఆశ్రయిస్తానని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి చెప్పారు. దీపావళి తరువాత ఆశారాం బెయిల్‌ కోసం దరఖాస్తు చేస్తానని ఆయన స్ప‌ష్టంచేశారు. ఆశారాంను అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారని స్వామి మండిప‌డ్డారు. ఉదయం న్యూఢిల్లీలోని జైలులో ఆశారాంతో సుమారు గంటసేపు సుబ్రహ్మణ్య స్వామి సమావేశమయి సుదీర్ఘంగా చ‌ర్చించారు.

అనంతరం సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి జైలు వ‌ద్దే మాట్లాడుతూ ఆశారాంను అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించార‌ని, ఈ బోగస్‌ కేసు కోర్టులో చెల్ల‌ద‌ని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో మత మార్పిడులకు పాల్పడుతున్న మిషనరీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందున సోనియా గాంధీ ప్రోద్బలంతో ఆయనపై కేసులు పెట్టారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. త‌ప్ప‌నిస‌రిగా తాను సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి త‌ర‌ఫున వాదిస్తాన‌ని చెప్పారు.