Begin typing your search above and press return to search.

అలా జరిగితే కాంగ్రెస్ తాట తీస్తానంటున్న స్వామి

By:  Tupaki Desk   |   13 May 2016 11:01 PM IST
అలా జరిగితే కాంగ్రెస్ తాట తీస్తానంటున్న స్వామి
X
బీజేపీ సీనియర్ నేత.. ఫైర్ బ్రాండ్..ఈ మధ్యనే రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన సుబ్రమణ్య స్వామి గురించి.. ఆయన మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరిమీదనైనా టార్గెట్ చేస్తే ఎంతగా ముప్పతిప్పలు పెడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఆయన తెర మీదకు తీసుకొచ్చిన కుంభకోణాలతో ఆయన వైరి పక్షం ఎంతగా విలవిలలాడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసిన స్వామి.. ఆ మధ్యన నేషనల్ హెరాల్డ్ ఉదంతంలో తల్లీ కొడుకుల్ని కోర్టు మెట్లు ఎక్కేలా చేసిన ఆయన.. తాజాగా ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో తెలిసిందే. తమ అధినేత్రిని అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నస్వామి మీద కాంగ్రెస్ నేతలు ఎంతగా మండిపడుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

తమను ఇబ్బంది పెడుతున్న స్వామి మీదా.. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మీద ప్రివిలేజ్ మోషన్ ను కాంగ్రెస్ నేతలు ప్రవేశ పెట్టిన అంశంపై స్పందించిన సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వారికి తాను నిజమైన చట్టానికి అర్థం ఏమిటో బోధిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలంగా మారాయి. స్వామి నోటి వెంట వచ్చిన ఈ మాటల తీవ్రత ఎక్కువన్న మాట వినిపిస్తోంది. పార్లమెంటులో తమ మీద ప్రివిలేజ్ మోషన్ చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ గుట్టును విప్పే పత్రాల్ని బయటపెడతానని చెబుతున్న స్వామి మాటలు వింటే.. సోనియా పరివారానికి కొత్త తిప్పలు తప్పేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.