Begin typing your search above and press return to search.

కొత్త బాంబు పేల్చిన స్వామి.. మళ్లీ వారిద్దరూ జైలుకేనట!

By:  Tupaki Desk   |   4 Sept 2019 11:06 AM IST
కొత్త బాంబు పేల్చిన స్వామి.. మళ్లీ వారిద్దరూ జైలుకేనట!
X
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి. సొంత పార్టీ మీద కానీ విపక్షం మీద కాని మొహమాటం లేకుండా వ్యాఖ్యలు చేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఈ కారణంతోనే స్వామి నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్య వస్తుందో ఒక పట్టాన ఆర్థం కాని పరిస్థితి నెలకొని ఉంటుంది. స్వామి మాట్లాడుతున్నారంటే.. ఎప్పుడేం మాట్లాడతారోనన్న టెన్షన్ సొంత పార్టీ నేతలకు ఉంటుందని చెబుతారు.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మన్మోహన్ ప్రభుత్వ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ అయి.. కొన్నాళ్లు జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజా.. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళిలకు మరోసారి జైలు తప్పదని తేల్చారు. ప్రస్తుతం డీఎంకే ఎంపీలుగా వ్యవహరిస్తున్న వీరిద్దరూ త్వరలో మరోసారి జైలుకు వెళ్లటం ఖాయమన్నారు.

మోడీ హయాంలో దేశ ఆర్థికపరిస్థితి దారుణంగా ఉందంటూ వస్తున్న విమర్శల్ని కొట్టి పారేసిన ఆయన.. ఆర్థిక వేత్త అయిన మన్మోమన్ సింగ్ ప్రభుత్వంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే తాజా పరిస్థితి కారణంగా చెప్పారు. ఆర్థికవేత్తగా ఉండి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న మన్మోహన్ కారణంగా ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నెలకొందన్నారు. మన్మోహన్ మాదిరి మోడీకి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక అంశాలు పెద్దగా తెలియకున్నా.. సంక్షేమ పథకాల్నిమాత్రం ఎఫెక్టివ్ గా అమలు చేయటం తెలుసన్నారు.