Begin typing your search above and press return to search.

శ్రీరాముడు కూడా ఎన్నికల్లో గెలవలేడట..!!

By:  Tupaki Desk   |   27 Sept 2018 4:48 PM IST
శ్రీరాముడు కూడా ఎన్నికల్లో గెలవలేడట..!!
X
హిందుత్వ భావాలు అత్యధికంగా ఉండేది దేశంలో ఆర్ ఎస్ ఎస్ వాళ్లకే.. వారే హిందుత్వ వాదాన్ని దేశం మొత్తం ప్రచారం చేస్తుంటారు. ఆర్ ఎస్ ఎస్ అండదండలతో ఎదిగిన బీజేపీ పార్టీ కూడా హిందుత్వ ఎజెండాతోనే ముందుకుపోతోంది. అలాంటి పార్టీ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశంలో ఎన్నికల తీవ్రతకు అద్దం పట్టింది. డబ్బు పంచనిదే ఎన్నికల్లో శ్రీరాముడు అయినా గెలవలేడని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఆర్ ఎస్ ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ తాజాగా గోవాలో ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడైనా సరే ఎన్నికల్లో ఈ కాలంలో డబ్బు పంచకపోతే గెలవలేడని ఆయన కుండబద్దలు కొట్టారు. ఓటర్లలో ఎక్కువగా ఉన్న యువత - మహిళలను ఆకట్టుకోవడానికి పార్టీలన్నీ ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయాలన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయని.. డబ్బు లేకపోతే గెలవడం ఆ దేవుడికి కూడా కష్టమని స్పష్టం చేశారు.

దీంతో ఆర్ ఎస్ ఎస్ - బీజేపీ వర్గాలు షాక్ తిన్నాయి. ఇంతటి ఎన్నికల వేళ ఆర్ ఎస్ ఎస్ ప్రముఖ్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేవుడొచ్చినా గెలవడంటూ ప్రస్తుత రాజకీయాల తీరుపై ఆయన విశ్లేషించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.