Begin typing your search above and press return to search.

హీరోయిన్ వెబ్ సైట్ తో మంత్రికి చుక్కలు

By:  Tupaki Desk   |   10 May 2016 10:31 AM IST
హీరోయిన్ వెబ్ సైట్ తో మంత్రికి చుక్కలు
X
హీరోయిన్ వెబ్ సైట్ తో మహారాష్ట్ర మంత్రి ఒకరికి చుక్కలు కనిపించాయి. ఆమె అభిమానుల తాకిడిని తట్టుకోలేని ఆయన తన ఫోన్ ను స్విచ్చాప్ చేయాల్సిన పరిస్థితి. దీంతో ఆయన కిందామీదా పడ్డారు. అయితే.. ఈ ఇష్యూలో సదరు హీరోయిన్ బుక్ కాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనికి మహారాష్ట్ర మంత్రి సుభాష్ దేశాయ్ కొత్త సమస్యలో పడ్డారు. ఆయన ఫోన్ నెంబరును ఆకతాయిలు ఎవరో.. మరాఠి నటి రింకూ రాజ్ గురు వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు.

హీరోయిన్ ఫోన్ నెంబరు వెబ్ సైట్లో దర్శనమిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు. ఎవరికి వారు తమ ఫోన్లకు పని చెప్పటం మొదలు పెట్టారు. దీంతో.. ఆయనకు నాన్ స్టాప్ గా ఫోన్ కాల్స్ రావటం మొదలైంది. మొదట్లో ఈ పరిస్థితి ఆయనకు మింగుడుపడకున్నా.. చివరకు విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన.. తన ఫోన్ ను స్విచ్ఛాప్ చేశారు. ఈ ఉదంతంలో హీరోయిన్ పాత్ర ఏమీ లేదని.. ఆమె వెబ్ సైట్ ను ఎవరో హ్యాక్ చేసి తన ఫోన్ నెంబరును పోస్ట్ చేశారంటూ సదరు మంత్రిగారే క్లారిటీ ఇచ్చారు.

హీరోయిన్ సైట్ ను హ్యాక్ చేసి.. తన ఫోన్ నెంబరును పెట్టటం ద్వారా హ్యాక్ చేసినోళ్లు తెలివితేటలు ప్రదర్శించినట్లుగా వ్యాఖ్యానించిన మంత్రిగారి మాటలు.. హీరోయిన్ రింకూకి పెద్ద ఉపశమనాన్ని కలిగించి ఉంటాయనటంలో సందేహం లేదు.