Begin typing your search above and press return to search.

సంప్రదాయ డ్యామేజీకి షాకింగ్ సర్జరీ చేసిన సుబ్బారెడ్డి

By:  Tupaki Desk   |   30 Aug 2021 10:42 AM GMT
సంప్రదాయ డ్యామేజీకి షాకింగ్ సర్జరీ చేసిన సుబ్బారెడ్డి
X
సాఫీగా సాగుతున్న ప్రయాణంలో సాహసాలు చేయటాన్ని అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా లేని ప్రమాదాల్నిమీదకు తెచ్చుకోవటానికి మించిన తెలివితక్కువ పని మరొకటి ఉండదు. టీటీడీ తీసుకునే కొన్ని నిర్ణయాలు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉండటమే కాదు.. ప్రభుత్వాన్నిఇబ్బందుల్లో నెట్టేలా ఉంటాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే చేసి.. గడిచిన వారం అందరి నోట్లో నానింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల కొండ మీద స్వామి వారి అన్న ప్రసాదం కింద భోజనాన్ని ఉచితంగా అందించటం తెలిసిందే.

నిజానికి తిరుమల కొండ మీద డబ్బులకు దొరికే భోజనంతో పోలిస్తే.. ఈ ఉచిత భోజనం అమోఘంగా ఉండటమే కాదు.. పక్కా ప్లానింగ్ తో నిర్వహిస్తారంటూ మెచ్చుకుంటూ ఉంటారు. నిత్యం వేలాది మంది తినే ఈ భోజనంపూర్తిగా ఉచితమన్న విషయం తెలిసిందే. ఇలాంటిచోట.. సంప్రదాయ భోజనం పేరుతో కాస్ట్ టు కాస్ట్ కు భక్తులకు అందిస్తామని ఈ మధ్యన టీటీడీ అధికారులు పేర్కొనటం తెలిసిందే.

సేంద్రీయ పద్దతిలో పండించిన వస్తువులతో ఈ భోజనాన్ని సిద్ధం చేస్తారని.. దీనికి అయ్యే ఖర్చును మాత్రమే వసూలు చేస్తారని.. ఎలాంటి అదనపు ఆదాయాన్ని తీసుకోరంటూ ప్రచారం చేయటమేకాదు.. మెనూను కూడా ప్రకటించారు. అయితే.. ఈ సంప్రదాయ భోజనం ఖరీదు ఎంతన్నది ఇంకా తేల్చలేదని పేర్కొన్నారు. దీనిపై పలువురు తప్పు పడితే.. మరికొందరు సానుకూలతను వ్యక్తం చేశారు. అయితే.. సంప్రదాయ భోజనంతో రానున్న రోజుల్లో మరిన్ని తిప్పలు తప్పించి మరింకేమీ ఉండవన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సంప్రదాయ భోజనం పేరుతో ఉచిత భోజనానికి దశల వారీగా మంగళం పాడాలన్న ఆలోచన చేస్తున్నారా ఏంటి? అన్న ప్రశ్న కొందరి నోటి నుంచి వచ్చింది. ఇలాంటివి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తాయన్న విషయాన్ని గుర్తించినట్లున్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. తాజాగా రంగంలోకి దిగిన ఆయన.. సంప్రదాయ భోజనాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. టీటీడీ పాలకమండలి లేనప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని.. తక్షణమే దాన్ని నిలిపేస్తున్నట్లుగా పేర్కొన్నారు. పాలకమండలి లేనప్పుడు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. కొండ మీద స్వామి వారి ప్రసాదం ఏదైనా ఉచితంగానే ఇస్తామని.. దానికి ఎలాంటి డబ్బులు తీసుకోమని స్పష్టం చేశారు. పాపం.. సంప్రదాయం పేరుతో పెద్ద ఎత్తున ఆదాయానికి ప్లాన్ చేసిన వారికి వైవీ భలే షాకిచ్చారుగా?