Begin typing your search above and press return to search.

పోలా.. అద్దిరిపోలా.. వైసీపీ నేతకు టీడీపీ సపోర్ట్‌!

By:  Tupaki Desk   |   5 March 2023 8:00 AM GMT
పోలా.. అద్దిరిపోలా.. వైసీపీ నేతకు టీడీపీ సపోర్ట్‌!
X
సుబ్బారావు గుప్తా పేరు తెలియనివారు లేరు. ఒంగోలులో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒకప్పుడు సుబ్బారావు గుప్తా ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. అయితే గతంలో బాలినేని జన్మదిన వేడుకల్లో గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలాంటివారు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉందని.. వారిని నియంత్రించాలని హాట్‌ కామెంట్స్‌ చేశారు. లేదంటే చింతమనేని ప్రభాకర్‌ వల్ల గత ఎన్నికల్లో టీడీపీకి ఎలాంటి నష్టం జరిగిందో అలాంటి నష్టమే కొడాలి నాని వల్ల వైసీపీకి జరుగుతుందని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై తర్వాత సుబ్బారావు గుప్తా వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు. వీటిని తట్టుకోలేక ఆయన గుంటూరులోని ఓ లాడ్జిలో దాక్కోగా అక్కడకు వచ్చిన సుభానీ అనే వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాను చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఆయన తాను పార్టీ మేలు కోసమే ఆ వ్యాఖ్యలు చేశానని.. సరిచేసుకోకుండా తనపై దాడికి దిగడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనకు రక్షణ కల్పించాలని సుబ్బారావు గుప్తా కోరారు. ఆయనపై దాడి వ్యవహారం వివాదాస్పదం కావడం, బాలినేని స్పందించడం, సుబ్బారావు గుప్తా ఆయనను కలవడంతో సమస్య సద్దుమణిగింది.

అప్పట్లో సుబ్బారావు గుప్తా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ను కూడా కలిశారు. కాగా తాజాగా గుప్తా... మళ్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్‌ పై విమర్శలు చేశారు. ఈ విమర్శలు చేసిన రెండు రోజులకే గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద గంజాయి దొరికిందని.. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా గతంలో గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు కూడా పెట్టారు.

ఈ నేపథ్యంలో అనూహ్యంగా టీడీపీ సుబ్బారావు గుప్తాకు మద్దతు ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులను అణచివేసే పనులకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్‌ ఆధ్వర్యంలో ఒంగోలులో టీడీపీ నేతలు సుబ్బారావు గుప్తాకు సంఘీభావంగా ర్యాలీ చేశారు.

విమర్శలను తట్టుకోలేక వైసీపీ నేతలు అక్రమంగా సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు పెట్టారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఒంగోలులోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి గాంధీజీ రోడ్డులోని గాంధీజీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు సంఘటితం కావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సుబ్బారావు గుప్తా అరెస్టు వ్యవహారంపై స్పందించారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మొత్తానికి వైసీపీ నేతకు టీడీపీ మద్దతు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.