Begin typing your search above and press return to search.

ఓయూ పరీక్షల్లో చరిత్ర సృష్టించిన స్టూడెంట్స్ !

By:  Tupaki Desk   |   24 Sep 2020 12:30 AM GMT
ఓయూ పరీక్షల్లో చరిత్ర సృష్టించిన స్టూడెంట్స్ !
X
కరోనా మహమ్మారి కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతబడ్డాయి. దేశంలో కరోనా విజృంభణ మొదలైన తరువాత మార్చిలో లాక్ డౌన్ అనౌన్స్ చేసిన తరువాత ,విద్యాసంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇచ్చిన తరువాత కొన్ని సంస్థలు ఓపెన్ అయినప్పటికీ కూడా విద్యాసంస్థలను మాత్రం ఓపెన్ చేయలేదు. ఆ తరువాత ఆన్లైన్ క్లాసులు ప్రారంభించారు. కొన్ని పరీక్షలు కూడా రద్దు చేశారు. అయితే , ఏదైనా డిగ్రీ చివరి సంవత్సరం చదివే విద్యార్థులు చివరి సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా రాయాలని ప్రభుత్వం , కోర్టు తేల్చిపడేసింది.

ఇక ఈ నేపథ్యంలో ఓయూ లో చివరి సంవత్సరం విద్యార్ధులకి చివరి సెమిస్టర్ పరీక్షలు పెట్టగా .. రికార్డ్ స్థాయిలో విద్యార్థులు హాజరై సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఒకవైపు కరోనా ‌ కల్లోలం.. మరోవైపు అందుబాటులో లేని ప్రజారవాణా.. అయినప్పటికీ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఓయూ పరిధిలో డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఏకంగా 97 శాతం హాజరు నమోదైంది. ఇప్పటివరకు వర్సిటీ చరిత్రలో డిగ్రీ పరీక్షలకు ఇంత పెద్దఎత్తున హాజరు నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడిస్తున్నారు. యూజీ కోర్సులకు సంబంధించి చివరి ఏడాది చివరి సెమిస్టర్‌ పరీక్షలను రోజూ రెండు సెషన్లలో ఓయూ నిర్వహిస్తోంది. ఉదయం సెషన్‌ లో బీకాం, మధ్యాహ్నం సెషన్‌ లో బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీఎస్ ‌డబ్ల్యూ కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా కోర్సులలో 57,436 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. తొలిరోజు 55,875 మంది హాజరయ్యారు.