Begin typing your search above and press return to search.

ఉమెన్ సేప్టీ టూల్ కనిపెట్టిన స్టూడెంట్స్ ... ఎవరైనా తాకితే అంతే !

By:  Tupaki Desk   |   29 April 2021 11:30 AM GMT
ఉమెన్ సేప్టీ టూల్ కనిపెట్టిన స్టూడెంట్స్ ... ఎవరైనా తాకితే అంతే !
X
మహిళల పై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఎంతమంది పోలీసులు , ఎన్ని చట్టాలు ఉన్నా కూడా మానవ రూపంలో ఉన్న మృగాళ్లు మహిళలు ఒంటరిగా కనబడితే చాలు ఆమె పై పడిపోతున్నారు. ఈ తరహా ఘటనలతో ఆడపిల్లను ఒంటరిగా బయటకి పంపించాలి అంటేనే తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. ఉదయాన్నే ఇంటి గడప దాటి బయటకి వెళ్లిన ఆడపిల్ల మళ్లీ ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేవరకు ఒకటే టెంక్షన్. ఎక్కడి నుండి ఎటువంటి వార్త వినాల్సి వస్తుందే ఏమో అన్న భయం. నిర్భయ , దిశా వంటి చట్టాలు ఎన్ని ఉన్నా , ఎన్ కౌంటర్లు చేస్తున్నా భయపడటం లేదు.

ఇదిలా ఉంటే మహిళలపై జరిగే అరాచకాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థినులు ఉమెన్‌ సేఫ్టీ పరికరాన్ని తయారుచేశారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ కు చెందిన మౌనిక, దివ్య, మహేశ్వరి, ఆశ్రిత, ఐశ్వర్య, సంకీర్తన, మోనిష, గాయత్రిలతో కూడిన బృందం ఈ పరికరాన్ని తయారుచేసింది. విజిటింగ్‌ కార్డు సైజ్‌ ఉండే ఈ పరికరాన్ని మహిళలు లోదుస్తుల్లో లేదా పాకెట్‌ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ పరికరాన్ని ఎవరు తాకినా వెంటనే వారికి కరెంట్‌ షాక్‌ తగిలి, దాదాపు 5 నిమిషాల పాటు సృహకోల్పోతారు. ఆ సమయంలో మహిళలు ఆ ఆపద నుంచి బయటపడొచ్చు. ఈ ఉమెన్‌ సేఫ్టీ పరికరం మహిళలకి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాజెక్టు గైడ్‌ వి.శేషగిరిరావు తెలిపారు. పరికరం తయారీకి విజిటింగ్‌ కార్డు సైజ్‌ బోర్డు, రెండు స్టీల్‌ పేట్లు, 4 ఓల్ట్‌ బ్యాటరీ, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌ఫార్మర్, స్పార్క్‌ గ్యాప్‌ కెపాసిటర్, పుష్‌ ఆన్‌ స్విచ్‌ వాడామని చెప్పారు. అరగంట చార్జింగ్‌ పెడితే దాదాపు 6 గంటల వరకు ఈ పరికరం పనిచేస్తుందన్నారు.