Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ప్రాణాలు తీసే టోర్నమెంట్

By:  Tupaki Desk   |   23 April 2019 1:30 AM GMT
హైదరాబాద్ లో ప్రాణాలు తీసే టోర్నమెంట్
X
ఆన్ లైన్ గేములు యువత ప్రాణాలు తీస్తున్నాయి. యువతను మానసిక రోగులుగా మార్చేస్తూ ఆత్మహత్యకు పురిగొల్పుతున్నాయి. ఇంత దారుణమైన ఈ గేమ్ ను నిషేధించాలని ఓ వైపు ఉద్యమం సాగుతోంది. గుజరాత్ వంటి రాష్ట్రాలు నిషేధం కూడా విధించాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం కొందరు అక్రమార్కులు ఏకంగా టోర్నమెంట్ పెట్టి మరీ పోస్టర్లుతో ప్రత్యక్షమయ్యారు. ఆన్ లైన్ లో ఆసక్తిగల వారికి మెసేజ్ లు పంపి పబ్ జీ ఆడేందుకు ఆహ్వానిస్తున్నారు.

* పబ్జీ టోర్నమెంట్ ఇలా సాగుతుంది..

పేటీఎం ద్వారా రూ.30 చెల్లించిన వారికి వాట్సాప్ లో లింక్ ను పంపుతున్నారు. ఆ లింక్ ను ఉపయోగించి నిర్వాహకులు చెప్పిన సమయంలో గేమ్ లో పాల్గొనవచ్చు. ఇది వైరల్ కావడం.. ఈ నెల 23న టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తేలడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జనరల్ సెక్రెటరీ కేఎస్ ప్రదీప్ తెలిపారు. ఈ నెల 28న మరో పబ్ జీ టోర్నమెంట్ కు ప్లాన్ చేయడంతో ఆదివారం పీవైఎల్ నాయకులు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ గేమ్ ను తెలంగాణలో నిషేధించాలని కోరారు. యువత ఈ గేమ్ మాయలో పడి డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు కూడా తీసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. సోలో పబ్జీ గేమ్ పేరిట టోర్నమెంట్ నిర్వహిస్తున్న కొంతమంది యువకులను గుర్తించినట్టు సమాచారం. వారు రూ.30 ఎంట్రీ ఫీజు చెల్లించి ఈ గేమ్ లో పాల్గొన్నట్లు విచారణలో గుర్తించారు.

ఇలా యువతను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న పబ్ జీ గేమ్ ఆధారంగా ఏకంగా టోర్నమెంట్ నిర్వహించడం.. పోలీసుల దృష్టిలో పడడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ పోలీసులు కోరుతున్నారు.