Begin typing your search above and press return to search.

అమరావతి కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరుతూ విద్యార్థి పిటీషన్

By:  Tupaki Desk   |   16 Oct 2020 6:00 AM GMT
అమరావతి కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరుతూ విద్యార్థి పిటీషన్
X
విజయవాడకు చెందిన లా స్టూడెంట్ వేమూరు లీలాకృష్ణ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కేసు కాబట్టి అమరావతి రాజధాని విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలంటూ ఈ విద్యార్ధి హైకోర్టును అభ్యర్ధించారు.

సాధారణంగా కీలకమైన కేసుల విషయంలో దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. మొన్నటి అయోధ్య బాబ్రీ మసీదు కేసులో దేశమంతా సీబీఐ కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూసింది. దానిపై వివిధ చానెల్స్ లైవ్ అప్ డేట్స్ ఇఛ్చాయి. కానీ కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం మాత్రం కాలేదు. సుప్రీం కోర్టులోనూ పలు కీలక కేసుల విషయంలో ఇటువంటి ప్రత్యక్ష ప్రసారాలు ఇప్పటిదాకా జరిగినట్టు లేదు. ఆ క్రమంలోనే ఏపీకి కీలకమైన అమరావతి రాజధాని కేసులోనూ అంతే ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలోనే విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ వాదనేంటి? ప్రతిపక్షాలు, ప్రత్యర్థుల వాదన ఏంటనేది తెలుసుకోవాలని జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుందని విద్యార్థి లీలాకృష్ణ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి వాద, ప్రతివాదాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే అందరూ నేరుగా చూసే అవకాశం ఉంటుందని లీలాకృష్ణ కోర్టుకు విన్నవించారు.

సాధారణంగా కోర్టులు అనేవి ప్రజల అభిప్రాయాలు, గొంతుకలను, ప్రజాస్వామ్యాన్ని రక్షించే వారధులు. కాబట్టి అందులో జరిగేవి కూడా ప్రజలకు తెలిసేలానే తీర్పులు ఇస్తుంటాయి. అంతా ఓపెన్ గానే వ్యవహారం సాగుతుంటుంది. మరి ఈ విద్యార్థి ప్రతిపాదనను కోర్టు అంగీకరిస్తుందా? విచారణను లైవ్ ఇస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. దీనిపై కోర్టు ఏం నిర్ణయిస్తుందనేది ఉత్కంఠగా మారింది.