Begin typing your search above and press return to search.

అనంతలో మాజీ మంత్రి నారాయణకు షాక్.. చుట్టుముట్టి చొక్కా పట్టుకున్నారు

By:  Tupaki Desk   |   4 Dec 2019 10:02 AM IST
అనంతలో మాజీ మంత్రి నారాయణకు షాక్.. చుట్టుముట్టి చొక్కా పట్టుకున్నారు
X
మాజీ మంత్రిగా కంటే కూడా నారాయణ విద్యాసంస్థల అధినేతగా సుపరిచితులైన నారాయణకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా అనంతపురంలోని తన విద్యాసంస్థల పర్యవేక్షణకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నారాయణ స్కూల్స్ పర్యవేక్షణకు వచ్చిన ఆయన్ను విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ.. విద్యార్థుల జీవితాల్ని ఆడుకుంటున్నారంటూ మండిపడ్డారు. అయితే.. మాజీ మంత్రి నారాయణతో మాట్లాడే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాల నేతల్ని.. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చిన విద్యార్థి సంఘాల నేతలు మాజీ మంత్రి నారాయణ వద్దకు దూసుకొచ్చారు. ఒక్కసారిగా నారాయణ చొక్కా పట్టుకున్నారు. ఈ పరిణామంతో షాక్ తిన్నారు నారాయణ. ఉద్రిక్త వాతావరణంలో నారాయణ చొక్కా పట్టుకున్నారు. పెనుగులాటలో చొక్కా కాస్తా చినిగిపోయింది. ఈ సన్నివేశాన్ని చూసిన నారాయణ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సార్ చొక్కా పట్టుకుంటారా? అంటూ మండిపడ్డారు.

ఇదే సమయంలో విద్యార్థి సంఘాలకు చెందిన కొందరు విద్యార్థులు నారాయణ వాహనాల మీద రాళ్లతో దాడికి దిగారు. కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరువర్గాల్ని సముదాయించారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఫిర్యాదుతో విద్యార్థి సంఘాల నేతలపై కేసులు నమోదు చేశారు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న పరిణామాలతో నారాయణ తన పర్యటనను అర్థాంతరంగా ఆపేసుకొని వెళ్లిపోయారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలాన్ని రేపింది.