Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో నిప్పంటించుకుని విద్యార్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

By:  Tupaki Desk   |   19 Aug 2022 11:30 AM GMT
హైద‌రాబాద్‌లో నిప్పంటించుకుని విద్యార్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!
X
ఫీజుల కోసం కాలేజీ ప్రిన్సిపాల్ వేధింపులు త‌ట్టుకోలేని ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన హైదరాబాద్ లోని రామంతాపూర్‌లో క‌ల‌క‌లం రేపింది.

రామాంతాపూర్ లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి త‌న టీసీ కోసం ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వ‌ద్ద‌కు వెళ్లి అడిగాడు.

అయితే ఆ విద్యార్థి ఫీజు బకాయిలు ఉండటంతో టీసీ ఇవ్వ‌డానికి కళాశాల సిబ్బంది నిరాకరించారు. ఇదే విషయంపై విద్యార్థికి, ప్రిన్సిపాల్ కు మధ్య వాగ్వాదం న‌డిచింది. ఈ వివాదం పెద్ద‌దైంది.

త‌న‌కు టీసీ ఇవ్వడం లేదనే బాధతో విద్యార్థి ప్రిన్సిపాల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అదే సమయంలో అక్కడున్న ప్రిన్సిపాల్ తో పాటు మరో వ్యక్తి అశోక్ రెడ్డిని పట్టుకోవడంతో విద్యార్థితోపాటు ఆ ఇద్దరికి కూడా గాయాలయ్యాయి.

కాలేజీ యాజమాన్యం వెంటనే 108కు సమాచారం అందించింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి రూ. 16 వేలు ఫీజు చెల్లించాల్సి ఉందని క‌ళాశాల సిబ్బంది చెబుతున్నారు.

ఫీజు కట్టాల‌ని ప్రిన్సిపాల్ వేధిస్తుండడంతో విద్యార్థి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా కాలిన గాయాలు కావ‌డంతో వారిని మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.