Begin typing your search above and press return to search.

'కోడెల' చుట్టూ గుంటూరు రాజకీయం..

By:  Tupaki Desk   |   3 March 2019 4:57 AM GMT
కోడెల చుట్టూ గుంటూరు రాజకీయం..
X
గుంటూరు జిల్లాలో కోడెల చుట్టూ జరుగుతున్న రాజకీయం సెగలు రేపుతోంది. ఈ ఐదేళ్లు జరిగింది ఒక ఎత్తయితే వారం పదిరోజుల నుంచి సత్తెనపల్లిలో జరిగిన పరిణామాలు ఒక ఎత్తు. క్విట్‌ కోడెల..సేవ్‌ సత్తెనపల్లి పేరుతో విపక్షాలన్నీ ఒక్కటై ఆందోళన చేస్తున్నాయి.

1983 నుంచి వరుసగా ఐదుసార్లు కోడెల శివప్రసాద్‌ నరసరావుపేట నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజ తరువాత కోడెల సొంత గ్రామం కండ్లకుంట సత్తెనపల్లి నియోజకవర్గంలోకి వెళ్లింది. దీంతో బలం అంతా అటు వెళ్లడంతో 2009 ఎన్నికల్లో కోడెల ఓడిపోయారు. 2014లో పొత్తులో భాగంగా నరసరావుపేట సీటును బీజేపీకీ కేటాయించింది టీడీపీ. దీంతో సత్తెనపల్లికి మారి అంబటి రాంబాబుపై గెలిచారు. ఆ తరువాత స్పీకర్‌ పదవిని చేపట్టారు.

సత్తెనపల్లిలో కోడెల కుటుంబంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకుంటారనే ఆరోపణలు పెద్ద ఎత్తునే ఉన్నాయి. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనుల్లో కమిషన్ల వ్యవహారంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సత్తెనపల్లి వద్ద ఓ భూ వివాదంలో జోక్యం చేసుకొని దానిని బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇవేకాక ప్రభుత్వ పథకాల్లో వాటాలు వసూళ్లు చేస్తున్నారని టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మినహా ప్రతిపక్షాలన్నీ ఒక్కటై కోడెల కుటుంబంపై ఆందోళన చేపట్టాయి. కోడెల హఠావో.. సత్తెనపల్లి బచావో అంటూ నినాదాలతో ర్యాలీలు కూడా తీశారు.

మరోవైపు డంపింగ్‌ యార్డును తరలించాలనే డిమాండ్‌ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికల సమయంలో సత్తెనపల్లికి పక్కనే ఉన్న గుండ్లూరుకు తరలించారు. అక్కడి గ్రామస్థులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారికి అంబటి రాంబాబు మద్దతుగా నిలవడంతో రాజకీయం వేడెక్కింది. ఈ డంపింగ్‌ వార్డుపైన, అవినీతిపైన కోడెల, అంబటిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇదిలా ఉండగా కోడెల దారెటు అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం సత్తెనపల్లిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ సమయంలో నరసరావుపేటకు వెళ్లాలా..? వద్దా..? అని తేల్చుకోలేకపోతున్నారు కోడెల. అయితే నరసరావపేట నుంచి తాను... సత్తెనపల్లి నుంచి తన కొడుకును పోటీ చేయించాలని చూస్తున్నారు. టీడీపీ మాత్రం ఒక్క సీటు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నరసరావుపేటలో సరైన నేత లేరు. అందువల్ల అదే సీటును కన్ఫామ్‌ చేయనున్నారట పార్టీ అధినేత. అయితే నరసరావుపేటకు వెళితే 2009 సీన్‌ రిపీట్‌ అవుతుందని భావిస్తున్నారు. దీంతో కోడెల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.