Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా వైరల్ గుట్టు రట్టైంది

By:  Tupaki Desk   |   21 July 2016 8:11 AM GMT
సోషల్ మీడియా వైరల్ గుట్టు రట్టైంది
X
విషయం ఏదైనా సరే.. ఉన్నట్లుండి ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ కావటం.. గంటల వ్యవధిలోనే అది దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందటం.. కొత్త ఉద్రిక్తలకు.. ఉద్వేగాలకు తెర తీయటం లాంటివి ఈ మధ్యన తరచూ చూస్తున్నాం. దేశంలోని మారుమూల ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఉన్నట్లుండి సోషల్ మీడియాలో వైరల్ గా మారటం.. దీనికి జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకూ అందరూ ప్రాధాన్యత ఇవ్వటం.. చివరకు అదో పెద్ద ఇష్యూగా మారటం ఈ మధ్యన ఎక్కువైంది.

అయితే.. ఈ వైరల్ వ్యవహారం అంత సహజం కాదని.. కొందరు టెకీలు టెక్నాలజీ సాయంతో చేస్తున్న వ్యవహారమన్న విషయం తాజాగా ఒక జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బద్ధలైంది. కొంతమంది నాయకుల్ని ఆకాశానికి ఎత్తేయాలన్నా.. పాతాళానికి తొక్కేయాలన్నా.. ఎవరినైనా ప్రత్యేకంగా టార్గెట్ చేయటం.. ప్రభుత్వాలపై తీవ్రమైన ఒత్తిడికి గురి చేయటం.. మత శక్తులు చెలరేగిపోయేలా చేయటం.. దేశం రగిలిపోయేలా చేయటం వెనుక టెకీల దుర్మార్గం ఉందన్న విషయం బయటకు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఒక జాతీయ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తో కొన్ని టెకీ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో పాటు.. టెక్నాలజీ సాయంతో దేశ వ్యాప్తంగా ఎన్నెన్ని అలజడులు రేపుతున్నారన్న సంచలన వాస్తవాలు బయటకు వచ్చాయి. తమ ముందుకు వచ్చిన పనిని పూర్తి చేయటమే తమకు ముఖ్యమే తప్పించి.. దాని వల్ల చోటు చేసుకునే విపరిణామాలకు తమకేమాత్రం బాధ్యత లేదనట్లుగా స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన టెకీ సంస్థల ప్రతినిధులు చెప్పుకోవటం కనిపిస్తుంది.

తాము చేపట్టే ఒక్కో పని కోసం రూ.7 నుంచి రూ.10కోట్ల వరకూ చార్జ్ చేస్తామని.. తాము వైరల్ చేసే అంశానికి సంబంధించిన విపరిణామాల్ని తాము అస్సలు పట్టించుకోమని వారు చెప్పటం గమనార్హం. ఎవరినైనా భ్రష్టు పట్టించే ప్రాజెక్టును తీసుకుంటే అందుకు కోసం తాము నిర్వహిస్తున్న కంపెనీ తరపు నుంచి కాకుండా.. వేరే నెట్ వర్క్ తో ఇలాంటి పనులు పూర్తి చేస్తామని కొన్ని టెకీ కంపెనీలు చెప్పటం గమనార్హం. సోషల్ మీడియాతో దేశాన్ని ఇష్టారాజ్యంగా ఆడుకుంటున్న టెకీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.