Begin typing your search above and press return to search.

బెజవాడలో వైసీపీ ఎమ్మెల్యే.. వంగవీటి వర్గాల మధ్య స్ట్రీట్ ఫైటింగ్.. చివర్లో ట్విస్టు

By:  Tupaki Desk   |   10 Jan 2021 8:20 AM GMT
బెజవాడలో వైసీపీ ఎమ్మెల్యే.. వంగవీటి వర్గాల మధ్య స్ట్రీట్ ఫైటింగ్.. చివర్లో ట్విస్టు
X
ఊహించని విధంగా చోటు చేసుకున్న పరిణామం స్ట్రీట్ ఫైటింగ్ గా మారింది. బెజవాడలో సంచలనంగా మారిన ఈ ఉదంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు.. వంగవీటి రాధా వర్గీయుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు కారణమైంది. ఇందుకు హనుమాన్ జంక్షన్ వేదికైంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

కలకత్తా - చెన్నై జాతీయ రహదారిపై దెందులూరు వైసీప ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.. వంగవీటి రాధలు తమ వాహనాల్లో ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్నారు. అయితే.. ఇరువురు నేతలకు చెందిన వాహనాలు వేగంగా వెళుతూ.. హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత ఎమ్మెల్యే అనుచరులకు చెందిన వాహనాలు ముందుకెళ్లాయి. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వాహనం మధ్యలో ఉండిపోయింది.

దీంతో.. ఎమ్మెల్యే అనుచరులు రాధ అనుచరుల్ని పక్కకు తప్పుకోవాలని కేకలు వేశారు. ఇది కాస్తా.. వంగవీటి అనుచరులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించేలా చేశాయి. దీంతో.. ఇరు వర్గాల వారు తమ కార్లను రోడ్డు పక్కన ఆపేసి.. ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువురునేతలకు సర్ది చెప్పారు.

వంగవీటి అనుచరుల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు గాయపడ్డారని చెబుతున్నారు. దీంతో.. ఉద్రికత్త వాతావరణం నెలకొంది. అయితే.. ఇరువర్గాల మీద పెరిగిన గొడవకు చెక్ చెప్పేందుకు ఇరువురు నేతలు ఒకే కారులో విజయవాడ వైపు వెళ్లటం గమనార్హం. గొడవ పడటం ఎందుకు? కొట్టుకోవటం ఎందుకు? మళ్లీ ఒకే కారులో వెళ్లటం ఎందుకు? కాస్త ఆవేశాన్ని అదుపులోకి ఉంచుకుంటే.. ఈ తరహా అనవసర రచ్చలకు అవకాశమే ఉండదు కదా?