Begin typing your search above and press return to search.

ఏంటీ.. లోహపు స్తంభం.. రోజుకో దేశంలో దర్శనం..ఇది ఏలియన్స్ పనేనా

By:  Tupaki Desk   |   3 Dec 2020 12:30 AM GMT
ఏంటీ.. లోహపు స్తంభం.. రోజుకో దేశంలో దర్శనం..ఇది ఏలియన్స్ పనేనా
X
ఓ 10-12 అడుగుల లోహపు స్తంభం ఇప్పుడు పలు దేశాల్లో చర్చనీయాంశమైంది. ఇవాళ ఒక దేశంలో కనిపించే లోహపు స్తంభం తర్వాత కొద్ది రోజులకు మరో దేశంలో కనిపిస్తోంది. అయితే దీన్ని ఎవరు పాతి పెడుతున్నారో అంతుబట్టడం లేదు. దానిని ఒక చోట నుంచి మరోచోటికి ఎలా తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదు. అయితే ఇది మనుషులు చేస్తున్న పని కాదని గ్రహాంతరవాసుల పనేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

యూరప్ లోని రోమానియా లో కొద్దిరోజుల కిందట అకస్మాత్తుగా ఓ లోహపు స్తంభం ప్రత్యక్షమైంది. దాన్ని ఎవరు పాతిపెట్టారో ఇప్పటి వరకు తెలియదు. అలాంటి లోహపు స్తంభమే అమెరికాలోని ఎడారిలో కొన్ని రోజుల కిందట పాతిపెట్టి కనిపించింది. అయితే దాన్ని అక్కడికి ఎవరు తెచ్చిపెట్టారు ఎవరు పాతారు.. అనే విషయాలను తెలుసుకులోపే అది అక్కడి నుంచి అదృశ్యమైంది. ఈ రెండు ఘటనలకు సంబంధించి ఇప్పటికీ నిజానిజాలు తెలియక పోగా తాజాగా మరోసారి లోహపు స్తంభం దర్శనమిచ్చింది.

రొమేనియా లోని పియాత్రా నీమ్త్ లో ఉన్న పురాతన పెట్రోదావా దాసియన్ కోటకు కొన్ని మీటర్ల దూరంలో లోహపు స్తంభం కనిపించినట్లు డైలీ మెయిల్ తెలియజేసింది. తాజాగా బయటపడిన లోహపు స్తంభం 13 అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్తంభం రోమేనియాలో సహజసిద్ధమైన ఏడు వింతల్లో ఒకటైన సియాహ్లు పర్వతం వైపు చూస్తున్నట్టుగా ఉంది. ఇది 10 నుంచి 12 అడుగుల ఎత్తుతో మూడువైపులా స్టీల్ తో తయారుచేశారు.

అయితే అమెరికాలోని ఎడారిలో కనిపించిన స్తంభం రొమేనియా లో కనిపించిన స్తంభం ఒకటి కాదని వేరువేరు అని నిర్ధారిస్తున్నారు. అమెరికాలోని ఎడారిలో పెట్టిన స్తంభం ఉన్నట్టుండి మాయమైందని.. ఇప్పుడు రొమేనియా లో ప్రత్యక్షమైందని ఇది కచ్చితంగా ఏలియన్స్ పనేనని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు.

అమెరికాలో లోహపు స్తంభం కనిపించడం సంచలనంగా మారడంతో కొందరు కావాలనే అలాంటిది తయారు చేసి రొమేనియా లో పాతారని అంటున్నారు.ఈ లోహపు స్తంభం వెనకాల నిజం తెలుసుకునేందుకు విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉండడంతో రొమేనియా అధికారులకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. తామే లోహపు స్తంభం గురించి తొలిసారి వింటున్నామని చెబుతున్నారు. ఈ పనికి పాల్పడింది ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు చెబుతున్నారు.