Begin typing your search above and press return to search.

జీవనం కోసం వెళ్లి 'జీవమే' కోల్పోయి.. గల్ఫ్ లో చనిపోగా 4నెలలకు ఇంటికి మృతదేహం

By:  Tupaki Desk   |   7 Sep 2020 4:15 AM GMT
జీవనం కోసం వెళ్లి జీవమే కోల్పోయి..  గల్ఫ్ లో చనిపోగా  4నెలలకు ఇంటికి మృతదేహం
X
పొట్టకూటికోసం గల్ప్​వెళ్లిన ఓ కార్మికుడి జీవితం అత్యంత విషాదంగా ముగిసింది. బాత్​రూంలో జారిపడటంతో ఆ కార్మికుడికి తలకు గాయమైంది. అనంతరం పట్టించుకొనేవారు లేక.. సరైన వైద్యం అందక అక్కడే మృతిచెందాడు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే నాలుగు నెలల తర్వాత అతడి మృతదేహం స్వస్థలానికి చేరింది. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండాపూర్ కు చెందిన సుంకె రాజయ్య(55) కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. గత ఏప్రిల్​లో బాత్​ రూమ్ లో జారి పడటంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. చికిత్స సమయంలో కోమాలోకి వెళ్లాడు.

సౌదీ రాజధాని రియాద్‌లోనే చికిత్స పొందుతూ ఏప్రిల్ 14న ప్రాణాలు కోల్పోయాడు. రాజయ్యతో పనిచేసేవారు ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. అప్పటికే లాక్​డౌన్ అమల్లో ఉండటంతో అంతర్జాతీయ విమానాలు ఆగిపోయాయి. దీంతో రాజయ్య మృతదేహం రియాద్​లోనే ఉండిపోయింది. కొండాపూర్​కు చెందిన టీఆర్​ఎస్​ నాయకుడు ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. వారు సౌదీలోని రాయబార కార్యాలయానికి లేఖలు రాశారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంపై చొరువచూపాయి.

పలు ఎన్జీవోలు ఆర్థికంగా సహకరించాయి. దీంతో ఎట్టకేలకు శనివారం రాజయ్య మృతదేహం హైదరాబాద్​లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నది. ఆదివారం స్వగ్రామం కొండాపూర్​లో రాజయ్యకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాజయ్యకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నాడు. ఓ కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నది. మరో కూతురుకు ఇటీవలే వివాహం అయ్యింది. కుమారుడు ఐటీఐ చదువుతున్నాడు.

‘నాన్న సౌదివెళ్లాక ఒక్క రూపాయి కూడా మాకు పంపించలేదు. చనిపోయిన తర్వతా కంపెనీ కూడా డబ్బులు ఇవ్వలేదు. కనీసం మా నాన్న పనిచేసిన దానికి కూడా జీతం ఇవ్వలేదు. మృతదేహంతో పాటు వేతనం పంపిస్తామన్నారు. ఇప్పడు కూడా డబ్బులు ఇవ్వలేదు. మమ్మల్ని అక్కడి కంపెనీ ఆదుకోవాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు రాజయ్య కుమారుడు తిరుపతి.