Begin typing your search above and press return to search.

పశ్చిమగోదావరి జిల్లాలో వింతవ్యాధి కలకలం..కుట్ర కోణం అంటున్న మంత్రి ఆళ్ల నాని!

By:  Tupaki Desk   |   23 Jan 2021 8:30 AM GMT
పశ్చిమగోదావరి జిల్లాలో వింతవ్యాధి కలకలం..కుట్ర కోణం అంటున్న మంత్రి ఆళ్ల నాని!
X
పశ్చిమగోదావరి జిల్లాలో వింతవ్యాధి కలకలం సృష్టిస్తుంది. గత సంవత్సరం ఏలూరులో విస్తరించిన వింత వ్యాధి, ఇప్పుడు మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలను వణికిస్తుంది. నాలుగైదు రోజుల నుంచి పూళ్ళ, భీమడోలు, గుండుగొలను , కొమిరేపల్లి గ్రామాలలో మొత్తం 36 మంది వింత వ్యాధి బారిన పడ్డారు. కొమిరేపల్లి లో గురువారం రాత్రి ఒక కేసు నమోదు కాగా శుక్రవారం మొత్తంగా 24 మంది ఈ వ్యాధి బారిన పడటం ప్రజలను భయాందోళనకు గురి చేసింది.

దీనిపై వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతాధికారులను రంగంలోకి దించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ , వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని, ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గీతా ప్రసాదిని కొమిరేపల్లి కి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించారు. వింత వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని, వైద్యచికిత్స అందిన వెంటనే వారంతా తిరిగి కోలుకుంటున్నారని అటు అధికారులు, మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ఏలూరులో వందల సంఖ్యలో అకస్మాత్తుగా వింత వ్యాధి బారిన పడిన సంఘటనలకు కారణాలపై అధ్యయనం చేయడానికి జాతీయ సంస్థలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

ఢిల్లీ ,పూణే, హైదరాబాద్ వంటి నగరాల నుండి ఏలూరులో వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు అక్కడ త్రాగు నీటి పైన, ఆహారపదార్థాల పైన పరిశోధన జరిపి సంఘటనలకు గల కారణాలను క్రోడీకరించిన నివేదికను తయారు చేశారు, త్వరలో సీఎం జగన్ కు ఆ నివేదిక అందివ్వనున్నారు. ఎవరు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మీ వెంట ఉంది అని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ అంతుచిక్కని వ్యాధి సంఘటనలకు సంబంధించి రాజకీయ కుట్ర కోణం ఉన్నట్లుగా భావించాల్సి వస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కొమిరేపల్లిలో బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన ఆళ్ల నాని ఏలూరు పరిసర ప్రాంతాల్లో వ్యాధిని వారం రోజుల్లో పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చామని మళ్లీ కొత్తగా అక్కడక్కడా కేసులు నమోదు కావటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.