Begin typing your search above and press return to search.

వింత కోరిక: వంద మంది భార్యలు.. వెయ్యి మంది పిల్లలు!

By:  Tupaki Desk   |   14 May 2021 2:30 AM GMT
వింత కోరిక: వంద మంది భార్యలు.. వెయ్యి మంది పిల్లలు!
X
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటారు పెద్దలు. ఒక్కక్కరికి జీవితంలో ఒక్కో లక్ష్యం ఉంటుంది. సహజంగా ఎవరైనా ఓ మంచి ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి కల్పించడం, ప్రపంచాన్ని చుట్టేయడం వంటివి తమ లక్ష్యాలుగా నిర్ణయించుకుంటారు. కానీ ఓ విశ్రాంత ఉద్యోగి మాత్రం ఇందుకు కాస్త భిన్నం. ఆయన వింత కోరిక ఇప్పుడు వార్తల్లో నిలిచింది. చనిపోయేవరకు పెళ్లుళ్లు చేసుకోవడం... పిల్లల్ని కనడమే తన లక్ష్యం అంటున్నారు. ఇది కాస్త విడ్డూరంగానే ఉంది కదూ...!

జింబాబ్వేకు చెందిన 66 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి మిషెక్ న్యాన్డెరో బహుభార్యత్వ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. 1983లోనే దీనికి మొదలు పెట్టారు. ఆయనకు ఇప్పటివరకు 16 మంది భార్యలు, 151 మంది సంతానం ఉన్నారు. ఇక త్వరలో 17వ వివాహం జరుగుతుందని చెబుతున్నారు ఆయన. అంతేకాదండోయ్ తాను మరణించేవరకు పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడమే లక్ష్యమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వంద మందిని వివాహమాడి... వెయ్యి మందిని కంటానని చెబుతున్నారు.

పెళ్లి చేసుకునే ముందు వారికి ఈ విషయం స్పష్టంగా చెప్పిన తర్వాతే మిగతా కార్యక్రమాలు జరుగుతాయని అంటున్నారు. ఇక తన పూర్తి సమయాన్ని భార్యలను సంతృప్తి పరచడానికే ఉపయోగిస్తానని పేర్కన్నారు. ప్రతి భార్య తనకోసం ప్రత్యేకంగా వంట చేస్తుందని గౌరవంగా చెబుతున్నారు. అంతేకాదు నచ్చిన పదార్థాలను మాత్రమే తింటాను... నచ్చనివి తిరిగి పంపిస్తానని ధైర్యంగా చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తన భార్యలకు ముందుగానే చాలా స్పష్టంగా చెప్పానని వివరించారు.

ఇంత మంది భార్యలు, పిల్లలతో ఆర్థిక సమస్యలు తలెత్తవా? అనే ప్రశ్నకు వింతగా సమాధానం చెప్పారు. తన సంతానమే తనను ఇలా మార్చిందని చెబుతున్నారు. తనకు పుట్టిన పిల్లలు పెరిగి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. వారే తన కోసం బహుమతులు తీసుకొస్తారని అన్నారు. ఆయన అవసరాలు అన్నీ తీర్చుతారని, ఖర్చులకు డబ్బులు ఇస్తారని పేర్కొన్నారు. ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆయన విలాసాన్ని తెలుసుకున్న నెటిజన్లు జీవితం అంటే నీది రాజా..! అంటూ కామెంట్లు చేస్తున్నారు.