Begin typing your search above and press return to search.

మా ఊరి రోడ్డు అదృశ్య‌మైంది.. పోలీసుల‌కు వింత ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   2 July 2021 5:30 PM GMT
మా ఊరి రోడ్డు అదృశ్య‌మైంది.. పోలీసుల‌కు వింత ఫిర్యాదు!
X
''మా ఊరిలోని రోడ్డు క‌నిపించ‌కుండా పోయింది.. పొద్దున వరకూ ఉన్న‌ రోడ్డు.. రాత్రి పూట మాయ‌మైపోయింది. దయచేసి వెతికి పెట్టండి.'' అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్థులు. ఈ వింత ఫిర్యాదు తొలుత పోలీసుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసినా.. ఆ త‌ర్వాత అస‌లు విష‌యం తెలుసుకొని ఉన్న‌తాధికారుల‌కు నివేదించారు. ఇంత‌కీ.. అస‌లు విష‌యం ఏమంటే...

మ‌హారాష్ట్ర‌లోని అత్యంత వెన‌క‌బ‌డిన జిల్లాల్లో ఒక‌టైన సిద్ధి జిల్లాలోని మంజోలి జ‌న‌ప్ పంచాయ‌తీ ప‌రిధిలో మేంద్ర అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి రోడ్డు వేసేందుకు ప్ర‌భుత్వం నుంచి రూ.10 ల‌క్ష‌లు మంజూర‌య్యాయి. కాంట్రాక్ట‌రు ప‌నులు చేప‌ట్టాడు. రోడ్డు నిర్మాణం కూడా పూర్త‌యిపోయింది. అయితే.. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు రోడ్డులో చాలా వ‌ర‌కు కొట్టుకుపోయింది. అంతేకాదు.. మొత్తం బుర‌ద మ‌యం అయిపోయింది. దీంతో.. గ్రామ‌స్థులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

స‌ర్పంచ్ తోపాటు ఉప స‌ర్పంచ్‌, ఇత‌ర గ్రామ‌స్తులు రోడ్డు నిర్మించిన కాంట్రాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి, ఇదేంట‌ని ప్ర‌శ్నించారు. కానీ.. కాంట్రాక్ట‌ర్ స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు. దురుసుగా మాట్లాడ‌డంతో.. వీరంతా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లారు. స్థానిక మంజోలి స్టేష‌న్ కు వెళ్లిన గ్రామ‌స్థులు. త‌మ గ్రామానికి చెందిన రోడ్డు క‌నిపించ‌ట్లేద‌ని ఫిర్యాదు చేశారు. రాత్రి వ‌ర‌కు రోడ్డు బాగానే ఉంద‌ని, కానీ.. తెల్ల‌వారే స‌రికి మాయ‌మైపోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడున్న రోడ్డు త‌మ‌ది కాద‌ని, అందువ‌ల్ల త‌మ రోడ్డును వెతికి తేవాల‌ని కోరారు.

కాగా.. ప్ర‌భుత్వ ప‌నుల‌కు సంబంధించిన కాంట్రాక్టులు ద‌క్కించుకుంటున్న వారు.. వ‌చ్చే నిధుల‌లో స‌గానికిపైగా మింగేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇది ఒక్క‌చోట కాకుండా.. దేశ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం. ల‌క్ష‌లు, కోట్లాది రూపాయ‌ల కాంట్రాక్టులు సొంతం చేసుకుంటున్న వారు.. నామ‌మాత్రంగా కూడా ప‌నులు నిర్వ‌హించ‌ట్లేదు. నాసిర‌కం ప‌నులు నిర్వ‌హిస్తూ.. మ‌మ అనిపిస్తున్నారు. వ‌ర్షం వ‌చ్చిన త‌ర్వాత‌గానీ.. కాంట్రాక్ట‌ర్లు చేసిన‌ ప‌నుల నిజ‌స్వ‌రూపం జ‌నాల‌కు అర్థం కావ‌ట్లేదు.

ఇదే విషయాన్ని తెలుసుకున్న మ‌హారాష్ట్ర‌లోని మేంద్ర గ్రామానికి చెందిన ప్ర‌జ‌లు రోడ్డు గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తొలుత ఇదేం ఫిర్యాదు అని ఆశ్చ‌ర్య‌పోయిన పోలీసులు.. ఆ త‌ర్వాత అధికారులు, కాంట్రాక్ట‌ర్ల అవినీతి గురించి పై అధికారుల‌కు విన్న‌వించారు. దీంతో.. ఈ విష‌యం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై సిధ్ జిల్లా అధికారులు స్పందించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. మ‌రి, అవినీతి అధికారుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న‌ది చూడాలి.