Begin typing your search above and press return to search.

అది జీవిత కాలం బరువు... ఆసక్తి రేపుతున్న అత్మ కధ‌

By:  Tupaki Desk   |   1 March 2022 11:30 PM GMT
అది జీవిత కాలం బరువు... ఆసక్తి రేపుతున్న అత్మ కధ‌
X
మానవ జీవితంలో ఎన్నో బరువులు మోయాల్సి ఉంటుంది. అయితే విధి వక్రిస్తే దానికి అదనంగా ట‌న్నుల కొద్దీ బరువుని మోస్తారు. జీవితకాలమంతా మనసు అలసిపోయినా ఆ బరువుని మోయకతప్పదు. ఇదంతా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీవితాన సాగరాన్ని మించిన విషాదం. ఆయన ఏకైక కుమారుడు జైన్ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మరణించారు. జైన్ వయసు ఇరవై ఆరేళ్ళు.

కడుపులో ఉన్నప్పటి నుంచే జైన్ గురించి ఎన్నో ఆశలు అల్లుకున్న సత్య నాదెండ్ల, ఆయన సతీమణి అనుపమలకు వైకల్యం కలిగిన కుమారుడు పుట్టాడు. అలాంటి పరిస్థితుల్లో జైన్ కడుపులో ఉన్నపుడే ఊపిరి పీల్చుకోలేక అవస్థలు పడుతూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ భూమి మీదకు వచ్చాడు. సిజేరియన్ చేసి జైన్ ని బయటకు తీశారు.

అలా జైన్ బాధను నాటి నుంచే అనుభవిస్తూ సత్య నాదెండ్ల గత ఇరవై ఆరేళ్ళుగా గుండె బరువుని మోస్తున్నారు. ఈ విషయాలను ఆయన తన జీవితంపై రాసుకున్న ఆటో బయాగ్రఫీ ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంలో వెల్లడించారు. అదిపుడు మరో మారు చర్చకు వస్తోంది.

అప్పట్లో ఒక ఉన్నతమైన స్థానంలో తానూ, తన భార్యా ఉన్నామని, తమ తొలి సంతానం కోసం ఎదురుచూస్తున్న వేళ ఇలా జరిగింది అని ఆయన రాసుకున్నారు. కడుపుతో ఉన్న వేళ ఎంతో అపురూపంగా అనుపమను నాడు సత్య నాదెండ్ల చూసుకున్నారు. రెగ్యులర్ చెకప్స్ తో పాటు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రేపో మాపో తమ వారసుడు బయటకు వస్తాడు అని అనుకుంటున్న వేళ సరిగ్గా 36వ వారంలో అనుపమ కపుడులో కదలికలు ఆగిపోయాయట.

అంతే ఆమెను సమీపంలోని ఆసుపత్రిలోకి తీసుకెళ్తే అక్కడ అత్యవసర చికిత్సలు చేసిన మీదట సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అలా బయటకు వచ్చిన బిడ్డ బరువు కేవలం కిలోన్నర మాత్రమే. ఉలుకూ పలుకూ లేని ఆ బిడ్డను చిన్న పిల్లల ఆసుపత్రిలో వైద్యం చేయించారు.

ఇక గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో తలెత్తిన సమస్య వల్లే జైన్ ఆరోగ్యానికి హాని జరిగిందని వైద్యులు చెప్పడంతో సత్య నాదెండ్ల దంపతులకు బిగ్ షాక్ అది. ఆ తరువాత రెండు మూడేళ్ళు గడచాక ఇక అది జీవిత కాల సమస్య అని ఏకంగా జీవిత పర్యంతం వీల్ చైర్ మీదనే జీవితం గడపాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో టన్నుల కొద్దీ బరువుని మోయడం నాడే అలవాటు చేసుకున్నారు సత్య నాదెండ్ల.

ఇలా ఒక రోజు రెండు రోజులు కాదు, ఇరవై ఆరేళ్ళ పాటు జైన్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆయనకు దేవుడు చేసిన అన్యాయానికి చింతిస్తూ సత్య నాదెండ్ల అనుభవించిన వేదన వర్ణనాతీతమే. జైన్ అంటే ప్రాణం. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ కొడుకుని చూసుకోకుండా ఆయన ఏ రోజూ ఉండలేదు. ఈ రోజు ఆ కుమారుడు ఈ లోకాన్ని వీడాడు. దాంతో సత్య నాదెండ్ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒక విధంగా ఇది జీవిత కాలం బరువుగానే ఆయనకు ఉంటుంది, కుమారుడు కళ్ళ ముందు లేకపోయినా జ్ఞాపకాలలో ఉంటూ ఆ గుండె బరువుని పదింతలు పెంచేశాడని సన్నిహితులు అంటున్నారు.