Begin typing your search above and press return to search.

‘బుల్లెట్ బండి’ స్టోరీ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   28 Aug 2021 9:30 AM GMT
‘బుల్లెట్ బండి’ స్టోరీ ఏంటో తెలుసా?
X
ఇటీవల ఓ వధువు తన పెళ్లిలో చేసిన డ్యాన్స్ వైరల్ అయింది. ఆమె ‘బుల్లెట్టు బండెక్కి వస్తా’ అనే పాటకు స్టెప్పులేసింది.. గాయని మోహన భోగరాజు పాడిన ఈ ప్రైవేట్ సాంగ్ ఇప్పుడు దుమ్ముదులుపుతోంది.అందరూ ఈపాటకు స్టెప్పులేస్తున్నారు. బుల్లెట్ పై ఈ ఒక్కపాటే కాదు.. చాలా పాటలు వచ్చాయి. జార్జిరెడ్డి సినిమాలో ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు’ అని వినబడుతుంది.. ఇక ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ మొత్తం బుల్లెట్టు బండిపైనే కనిపిస్తాడు... ఇలా పాటలు, సినిమాలతో పాటు బుల్లెట్టు బండి కూడా ఫేమస్ అవుతుంది. అంతేకాకుండా ఈ మధ్య ప్రతీ ఒక్కరూ ఖర్చు ఎక్కువైనా బుల్లెట్టు (రాయల్ ఎన్ ఫీల్డు) నే కొనేందుకే ఇష్టపడుతున్నారు. అయితే ఈ బల్లెట్టు బండికి చరిత్ర పెద్దదిగానే ఉంది. మరి ఆ బుల్లెట్టు బండి స్టోరీ ఎంటో ఒకసారి చూద్దాం..

19వ శతాబ్దంలో యూరప్ దేశాల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. ఆ సమయంలో రెడ్ డిచ్ ఎన్ ఫీల్డ్ కంపెనీ రైఫిల్స్, స్పోర్టింగ్ గన్ లను తయారు చేసి పలు దేశాలకు సరఫరా చేసేది. అంతేకాకుండా తుఫాకులను, ఫిరంగిలను కూడా తయారు చేసేది. ఈ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ ‘మేడ్ లైక్ ఏ గన్.. గోస్ లైక్ ఏ బుల్లెట్.. బిల్డ్ లైక్ ఏ గన్’ అనే ట్యాగు ఇచ్చింది. అప్పటి నుంచి రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ బైకులను తయారు చేయడం మొదలు పెట్టింది. ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా ఫ్యుగోడ్ కంపెనీ బైక్ లను తయారు చేయగా.. రాయల్ ఎన్ ఫీల్డ్ రెండో స్థానాన్ని ఆక్రమించింది.

ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను తయారు చేయడం మొదలు పెట్టింది. దీనిని మొదట్లో ఎక్కువగా డబ్బున్నవారే వాడేవారు. దీనిని సొంతం చేసుకోవాలంటే పేరు పలుకుబడి ఉన్నవారు మాత్రమే ధైర్యం చేసేవారు. అంతేకాకుండా ఈ బైక్ లను ప్రపంచ యుద్ధాల సమయంలో కొన్ని ప్రభుత్వాలు ఆర్మీకి అందించాయి. ఇండియాలోకి బ్రిటిష్ వాళ్లు వస్తూ రాయల్ ఎన్ ఫీల్డు బైక్ ను కూడా తీసుకొచ్చారు. అయితే ఆంగ్లేయులు భారత్ ను విడిచిన తరువాత ఈ బైక్ కు ప్రాధాన్యం మరింత పెరిగింది.

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆర్మీ జవాన్లకు ఈ బుల్లెట్టు బైక్ లను అందించారు. అయితే ఇంగ్లాండ్ నుంచి బైక్ లను తీసుకురావడానికి ఎంతో ఖర్చయ్యేంది. దీంతో చెన్నైలో బైక్ తయారీ ప్లాంట్ నెలకొల్పాలని నిర్ణయించారు. 1952లో మద్రాస్ మోటార్స్ ఇంగ్లాండ్ కు చెందిన రెడ్ రిచ్ కంపెనీ భాగస్వామ్యంతో రాయల్ ఎన్ ఫీల్డు ఇండియాను స్థాపించారు. ప్రారంభంలో 350 సీసీ ఇంజన్ కెపాసిటీతో బైక్ ను తయారు చేశారు. భారత్ లో మొట్టమొదటిసారిగా తయారైన బైక్ రాయల్ ఎన్ ఫీల్డు వారి బుల్లెట్టే. ప్రారంభంలో ఇంగ్లాండ్ నుంచి విడిభాగాలు తెప్పించి ఇక్కడ బైక్ తయారు చేయడం మొదలు పెట్టారు. ఆ తరువాత ఇక్కడే అన్ని విడిభాగాలు తయారు చేస్తూ బైక్ లను తయారు చేస్తున్నారు. ఇక ఆర్మీకి రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఇప్పటికీ బుల్లెట్లను అందిస్తోంది.

రాజసం గొలిపే ఈ బైక్ ఎంత దర్జాగా ఉంటుందో.. అంత మైలేజ్ ఇవ్వదు. ఈ బైక్ లు ఎక్కువగా ఇంధనాన్ని తాగేవి. ప్రస్తుతం ఈ బైక్ సింగిల్ సిలిండర్ 325 సీసీ డిజిల్ ఇంజన్ వేరియంట్ తో పనిచేస్తూ 6.5 బీహెచ్పీ సామర్థ్యంతో 15 ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేసేది. లీటర్ డీజిల్ కు 70 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చేది. 12 సంవత్సరాలపాటు అందుబాటులో ఉన్న ఈ బైక్ మోడల్ బాగున్నా ధర ఎక్కువ కావడంతో సేల్స్ పెరగలేదు. దీంతో ఈ ఉత్పత్తిని ఆపేశారు.