Begin typing your search above and press return to search.

పోలవరం కథ.. పయనం ఎటు?

By:  Tupaki Desk   |   29 May 2019 2:30 PM GMT
పోలవరం కథ.. పయనం ఎటు?
X
విభజన హామీల్లో ఒకటి పోలవరం. దాన్ని జాతీయ పాజెక్టుగా స్వీకరించి కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్మించే బాధ్యతలు తీసుకుంది. అయితే ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం పనిని చంద్రబాబు నాయుడు చేయనివ్వలేదు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ ప్రాజెక్టు బాధ్యతను ఏపీకి ఇవ్వాలి డిమాండ్ చేశారు. కేంద్రం కూడా అందుకు ఓకే చెప్పింది. అప్పుడు బీజేపీ- టీడీపీలు మిత్రపక్షాలు కావడంతో ఆ బదలాయింపు ఈజీగా నే సాగింది.

అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. పోలవరం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనాలను పెంచుకొంటూ వచ్చింది. వేల కోట్ల రూపాయల మొత్తాలను అంచనాల విషయంలో పెంచేస్తూ పోయింది. ఒక దశలో కేంద్రం అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలోకి పడిపోయింది. అయితే అప్పటికీ టీడీపీ-బీజేపీలు మిత్రపక్షాలే కావడంతో పైకి ఏమీ మాట్లాడలేదు.

మరోవైపు చంద్రబాబు నాయుడు నిధులన్నింటినీ పోలవరం బాట పట్టించేస్తూ వచ్చారు. అందులో చంద్రబాబు స్వార్థం చాలానే ఉందని, కాంట్రాక్టర్లకు అలా నిధులు ఇచ్చేస్తూ అందులో వాటాలు పొందుతూ ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే.. పోలవరం విషయంలో రాష్ట్ర నిధులను భారీగా ఖర్చు పెట్టేసినట్టుగా, కేంద్రం మాత్రం డబ్బులు ఇవ్వలేదనే ప్రచారాన్ని మొదలుపెట్టారు.

బీజేపీతో తెగదెంపులు చేసుకునే సమయానికి చంద్రబాబు నాయుడు పోలవరం విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలిపే ప్రయత్నం చేశారు. అయితే కేంద్రం తన వాదనను అప్పుడు వినిపించింది. ఇప్పటి వరకూ ఖర్చు పెట్టిన వివరాలను క్లియర్ గా చెప్పాలని.. అప్పుడు నిధుల విడుదల అని కేంద్రం వాదించ సాగింది. అది చినికి చినికి గాలివానగా మారింది. ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు చిత్తు అయిపోయారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ వచ్చింది.

అయితే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పాత వాదనే వినిపిస్తూ ఉంది. పోలవరం విషయంలో నిధుల కేటాయింపు అంకం దాదాపు పూర్తి అయ్యిందని, పెండింగ్ రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అని, ఇప్పటి వరకూ నిధుల కేటాయింపు వివరాలను ఇస్తే రెండు వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటామన్నట్టుగా కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తేల్చి చెప్పారని సమాచారం. తాజాగా కేంద్ర అధికారుల, పోలవరం అధికారుల మధ్యన జరిగిన సమీక్ష సమావేశంలో ఇలా తేల్చారట.

ఇప్పటి వరకూ పోలవరం పనులు సగం వరకూ కూడా పూర్తయ్యింది లేదు. కేంద్రం ఏమో రెండు వేల కోట్ల రూపాయల మొత్తమే పెండింగ్ అంటోంది. మరోవైపు ఏపీ ఎలెక్టెడ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణం అంకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుందన్నట్టుగా, దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించి ఉంటే.. ఆ విషయంలో కూడా చర్యలుంటాయని జగన్ స్పష్టం చేశారు!

ఇలా పోలవరం కొత్త మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఇలాంటి వివాదాల మధ్యన పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అనేది కూడా ప్రస్తుతానికి ఒక శేష ప్రశ్నే!