Begin typing your search above and press return to search.

ప‌నుల్ని ఆపండి.. బిల్లుల్ని నిలిపేయండి

By:  Tupaki Desk   |   31 May 2019 6:39 AM GMT
ప‌నుల్ని ఆపండి.. బిల్లుల్ని నిలిపేయండి
X
ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించినంత‌నే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న మార్క్ చూపించే కార్య‌క్ర‌మాల్ని షురూ చేశారు. తొలుత త‌న పేషీలో ప్రక్షాళ‌న షురూ చేసిన ఆయ‌న తీరుకు త‌గ్గ‌ట్లే.. తాజాగా ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా జ‌రుగుతున్న ఇంజ‌నీరింగ్ ప‌నుల‌తో పాటు బిల్లుల చెల్లింపుల్ని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న వేల కోట్ల ప‌నులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. త‌న నిర్ణ‌యానికి త‌గ్గ‌ట్లే ఎల్వీ తాజాగా ఒక నోట్ పంపారు. ప్ర‌భుత్వం అనుమ‌తులు మంజూరు చేసిన ప‌నుల్లోఏ ప‌నులు చేయాలి? వేటిని అపాలి? ఏ అంశాల్ని స‌మీక్షించాల‌న్న అంశంపై ఆయ‌నో నోట్ లో స్ప‌ష్ట‌త ఇచ్చారు.

రాష్ట్ర ఖ‌జానాలో డ‌బ్బులు లేనందున ఇంజ‌నీరింగ్ ప‌నులు నిలిపివేయాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. 2019ఏప్రిల్ కంటే ముందు మంజురై.. ఇంకా ప్రారంభం కాని ప‌నులన్నీ త‌ప్ప‌నిస‌రిగా ఆపేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌.. ప‌నులు మొద‌లై మొత్తం ప్రాజెక్టు విలువ‌లో పాతిక‌శాతం కంటే త‌క్కువ వ్య‌యం అయిన వాటిని రివ్యూ చేస్తామ‌ని.. వీటికి సంబంధించి త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కూ ఎలాంటి చెల్లింపులు జ‌ర‌ప‌కూడ‌ద‌ని తేల్చారు.

ఇదిలా ఉంటే.. కొన్ని ప‌నుల కోసం బ్యాంకుల రుణాల్ని తీసుకొని ప‌నులు స్టార్ట్ చేశారు. అలాంటి వాటిని మ‌రోసారి స‌మీక్షించ‌నున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని చూస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న ప‌నుల విష‌యంలో ఒక‌సారి క్రాస్ చెక్ చేసిన త‌ర్వాతే ప‌నులు స్టార్ట్ చేయాల‌ని.. అప్ప‌టివ‌ర‌కూ ఆపేయాల‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు చెబుతున్నారు.