మూలాల్ని మర్చిపోయిన జాతి చాలా అరుదుగా ఉంటుంది. వలసలతో మొదలైన అమెరికా జాతి నిర్మాణం.. కాలం గడుస్తున్న కొద్దీ అదే తీరును సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రజలకు అవాసంగా అమెరికాను భావిస్తారు. అందుకే ప్రపంచ ప్రజలంతా అమెరికా కలలు కంటుంటారు. అలాంటి దేశంలో ట్రంప్ లాంటి తింగరి నేత ఎంట్రీతో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది.
అగ్రరాజ్యంలో ఎప్పుడూ చోటు చేసుకోని ఉదంతాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. జాత్యాంహకార దాడులు ఇప్పుడ మామూలుగా మారాయి. ఇంతకాలం గుండెల మీద చేతులు వేసి బతుకుతున్న కోట్లాది మందికి ఇప్పుడు కొత్త గుబులు వచ్చి చేరింది. వివిధ దేశాలకు చెందిన వారంతా అమెరికాలో సెటిల్ కావటమే కాదు.. ఆ దేశ పౌరులుగా మారిపోయిన వేళ.. ఇప్పుడు వివక్షను ప్రదర్శిస్తున్నవైనం అక్కడి వారిని తెగ ఇబ్బందికి గురి చేస్తోంది. మారిన పరిస్థితులు అమెరికాలోని భారతీయుల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. ఒంటి రంగుతో ఇట్టే గుర్తిస్తున్న అమెరికన్లు.. చట్టబద్ధంగా అమెరికన్లు అయినా భారతసంతతి వారిపై విరుచుకుపడుతున్నారు.
మీ దేశానికి మీరు వెళ్లిపొండంటూ మండిపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తలకెక్కిన వివక్షతో కాల్పులకు తెగబడుతున్నారు కూడా. ఈ కారణంగానే మొన్నటికి మొన్న తెలుగోడు శ్రీనివాస్ కూఛిబొట్ల ప్రాణాలు కోల్పోవటం.. మరో వ్యక్తిని ఇంటి దగ్గరే కాల్చేయటం తెలిసిందే. తాజాగా భారత సంతతి అమెరికన్ దీప్ రాయ్ అనే సిక్కు యువకుడిపై కాల్పులు జరిపిన వైనం ప్రవాస భారతీయుల్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
అమెరికాలో పడగవిప్పిన జాతివివక్షపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. రిక్కీ పటేల్ ఒకరు తన గళాన్ని వినిపించారు. చాలా కాలం క్రితం అమెరికాకు వెళ్లిన రిక్కీ పటేల్.. అమెరికాలో ఫారెల్ అండ్ పటేల్ పేరుతో న్యాయ సేవా సంస్థను ఏరపాటు చేశారు. ఈ సంస్థను విజయవంతంగా నడుపుతున్న ఆయన.. జాతివివక్షపై తన గళాన్ని విప్పారు. తన దృష్టిలో పడిన జాత్యాంహకార దాడిని వీడియో తీసిన ఆయన తాజాగా దాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఈ వీడియోను చూస్తే.. ఓ తెల్లోడు తన పెంపుడు కుక్కతో వచ్చి ముస్లింలా కనిపిస్తున్న ఒక హోటల్ ఓనర్ పై దాడి చేశాడు. ముస్లింలను తాను చంపేస్తానన్న తెల్లోడు.. ప్రవాసభారతీయుడ్ని చంపేందుకు సైతం సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు. అయితే.. సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అక్కడికి రావటంతో సదరు హోటల్ యజమాని బతికిపోయాడని.. లేదంటే తెల్లోడి దెబ్బకి బలైపోయి ఉండేవాడని వెల్లడించాడు. ఈ దాడిని ప్రస్తావిస్తూ.. తామంతా కూడా అమెరికన్లమేనని.. తమపై దాడులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
భారత్ లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు అమెరికాలో ఉన్నారని.. వారంతా భారతీయులేనని చెప్పిన ఆయన.. అమెరికాలో ప్రవాస భారతీయుల బలం ఎంతన్నది చెప్పుకొచ్చారు. అమెరికాసంయుక్త రాష్ట్రాలలో భారత్ కు చెందిన 35వేల మంది వైద్యులు ఉన్నారని.. అమెరికాలోని హోటళ్లలో సగం వరకూ భారతీయులదేనని.. ఈ విషయాల్ని గుర్తించాలని కోరుతున్న ఆయన.. కష్టపడే తత్త్వం భారతీయులకు ఉంటుందని చెప్పుకొచ్చారు.
వివక్షతో తమపై జరుగుతున్న దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలని.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలంటూ డిమాండ్ చేశారు. పటేల్ మాదిరి మిగిలిన భారతీయ అమెరికన్లు తమ గళాన్ని వినిపించటంతో పాటు.. తమపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం రియాక్ట్ అయి.. అలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించేలా ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/