Begin typing your search above and press return to search.

ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల‌దాడి..ఆళ్ల‌గ‌డ్డ‌లో టెన్ష‌న్‌..!

By:  Tupaki Desk   |   23 April 2018 7:50 AM GMT
ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల‌దాడి..ఆళ్ల‌గ‌డ్డ‌లో టెన్ష‌న్‌..!
X
క‌ర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఇప్పుడు నాట‌కీయంగా మార‌ట‌మే కాదు.. ఎప్పుడేం అవుతుందో తెలీని ప‌రిస్థితి నెల‌కొంది. సొంత పార్టీ నేత‌ల మ‌ధ్య పెరుగుతున్న గ్యాప్‌.. జిల్లా శాంతిభ‌ద్ర‌త‌ల‌కు స‌మ‌స్య‌గా మారుతుందా? అన్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ద‌శాబ్దాలుగా భూమా నాగిరెడ్డి కుటుంబానికి అండ‌గా.. ఆయ‌న‌కు న‌మ్మిన బంటుగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి.. మంత్రి భూమా అఖిల‌ప్రియల మ‌ధ్య రాజ‌కీయ విబేధాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి మీద జ‌రిగిన రాళ్ల‌దాడి వీరి మ‌ధ్య దూరాన్ని పూడ్చ‌లేనంత‌గా మార్చింద‌ని చెబుతున్నారు.

పార్టీ పిలుపు మేర‌కు ఏవీ సుబ్బారెడ్డి.. దాదాపు 500 మంది పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి సైకిల్ యాత్ర‌ను చేప‌ట్ట‌టం తెలిసిందే. వీరి సైకిల్ యాత్ర శిరువెళ్లలో స్టార్ట్ అయి య‌ర్ర‌గుంట్ల‌కు చేరుకున్న వేళ‌లో.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నాలుగు వాహ‌నాల్లో వ‌చ్చి వీరిపై క‌ర్ర‌ల‌తోనూ.. రాళ్ల‌తోనూ దాడి చేసి క్ష‌ణాల్లో మాయ‌మైన ఉదంతం తీవ్ర సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఆళ్ల‌గ‌డ్డ వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది.

ఏవీ సుబ్బారెడ్డి మీద బ‌హిరంగంగా రాళ్ల‌దాడి చేయ‌టంపై ఆయ‌న అనుచ‌రులు.. అభిమానులు ర‌గిలిపోయారు. ఆగ్ర‌హంతో కుత‌కుత‌లాడిపోయారు. ఈ వ్య‌వ‌హారాన్ని తీవ్రంగా రియాక్ట్ అయిన ఏవీ సుబ్బారెడ్డి త‌న త‌ఢాఖా ఏమిటో చూపిస్తాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానేంటో నిరూపిస్తాన‌ని చెప్పారు. భూమా అఖిల‌తో ఉన్న అంత‌ర్గ‌త పోరు మ‌రింత ముదిరేలా తాజా ప‌రిణామం కార‌ణ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే త‌న‌పైన దాడి జ‌రిగింద‌ని.. త‌న‌పై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. చ‌ట్ట‌ప్ర‌కారం వారిపై చ‌ర్య‌లు ఉండాల‌ని డిమాండ్ చేశారు. ఫ్యాక్ష‌న్ వ‌దిలిపెట్టి ప్ర‌శాంతంగా బ‌తుకుతున్న త‌మ‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకోమ‌న్నారు. క్ష‌ణాల్లో జ‌రిగిన దాడి తేరుకునే లోపు దుండ‌గులు మాయం కావ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా ఉంటే.. దాడి జ‌రిగిన కాసేప‌టికి అందుకు కార‌ణ‌మైన వాహ‌నాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వాహనంపై భూమా అన్న స్టిక్క‌ర్ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో పోలీసులు కొంద‌రు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. త‌న‌పై దాడి నేప‌థ్యంలో సోమ‌వారం ఆళ్ల‌గ‌డ్డ బంద్‌కు ఏవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అంత‌లో ఏమైందో కానీ.. బంద్ పిలుపును వెన‌క్కి తీసుకున్నారు. దాడి జ‌రిగిన త‌ర్వాత కూడా ఆయ‌న త‌న యాత్ర‌ను కొన‌సాగించారు. ఇదిలా ఉంటే.. ఏవీ సుబ్బారెడ్డిపై జ‌రిగిన దాడితో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చి చెప్పారు అఖిల‌ప్రియ‌. ఏవీ సుబ్బారెడ్డి త‌న‌కు తండ్రిలాంటి వార‌ని.. ఆయ‌న పిల్ల‌ల్ని తన చేతుల‌తో పెంచాన‌ని.. ఆ పిల్ల‌ల‌కు అన్యాయం చేయాల‌నే ఆలోచ‌న త‌న‌కు క‌ల‌లో కూడా రాద‌ని భూమా అఖిల‌ప్రియ వెల్ల‌డించారు.

త‌ల్లిదండ్రులు లేని బాధ త‌న‌కు తెలుస‌ని.. చూస్తూ.. చూస్తూ ఆ బాధ‌ను మ‌రొక‌రికి తాను ఎందుకు చేస్తాన‌ని ప్ర‌శ్నించారు. చిన్న‌త‌నంలో ఎమ్మెల్యే అయి.. మంత్రి కావటాన్ని జీర్ణించుకోలేక కొంద‌రు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని.. రాజ‌కీయాల్లో ఇలాంటివి స‌రైన‌వి కావ‌న్నారు. ఏవీపై జ‌రిగిన దాడి వెనుక ఉన్న‌ది ఎవ‌ర‌న్న‌ది పోలీసుల విచార‌ణ‌లో తేలుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. అయితే.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి వెనుక అఖిల‌ప్రియ ఉన్నార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. పోలీసుల విచార‌ణ‌లో ఏం తేలుతుందో చూడాలి.