Begin typing your search above and press return to search.

స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు.. మొత్తం విలువ ఎంతంటే?

By:  Tupaki Desk   |   11 Jan 2022 4:30 AM GMT
స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు.. మొత్తం విలువ ఎంతంటే?
X
తుమ్మితే ముక్కు ఊడిపోయేలాంటి పరిస్థితి స్టాక్ మార్కెట్ లో ఉంటుంది. అమెరికాకు జలుబు చేస్తే.. ఇక్కడి మార్కెట్ కు తమ్ములు రావటమేకాదు.. గజగజా వణికిపోయే పరిస్థితి. అలాంటి స్టాక్ మార్కెట్ కరోనామూడో వేవ్.. ఒమిక్రాన్ వేళ.. ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా దూసుకెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది.అంతర్జాతీయ మార్కెట్లలో ట్రెండ్ ప్రతికూలంగా ఉన్నప్పటికి భారత మార్కెట్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం విశేషంగా చెప్పాలి.

మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల నేపథ్యంలో షేర్ల కొనుగోళ్లు పెరిగాయి. దీంతో.. మార్కెట్ సానుకూలంగా స్పందిస్తూ ముందుకు వెళుతోంది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్.. ఎన్ఎస్ఈ నిఫ్టీలు బలపడ్డాయి. మరోసారి నిఫ్టీ 18వేలమార్కును దాటేసింది. గత ఏడాది నవంబరు 15 తర్వాతే సూచీలకు ఇదే గరిష్ఠ ముగింపు స్థాయిగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో రికార్డును స్టాక్ మార్కెట్ సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్ అందుకు భిన్నంగా ఉండటం తెలిసిందే. కొనుగోళ్ల జోరుతో స్టాక్ మార్కెట్ కళకళలాడుతోంది. తాజాగా స్టాక్ మార్కెట్ సంపద విషయంలోనూ సరికొత్త రికార్డును క్రియేట్ చేయటం గమనార్హం.

ఇప్పటివరకు ఉన్న రికార్డుల్ని చూస్తే.. 2020 అక్టోబరు 18న నమోదైన రూ.274.70 లక్షల కోట్లమార్కెట్ క్యాప్ దే రికార్డుగా ఉండేది. తాజాగా దాన్ని అధిగమించింది. సరికొత్త రికార్డు ప్రకారం ప్రస్తుతం మొత్తం స్టాక్ మార్కెట్ విలువ రూ.274.73 లక్షల కోట్లకు చేరుకోవటం ద్వారా పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదే జోరు కొనసాగితే.. మరిన్ని రికార్డులు నెలకొల్పడటం ఖాయమని చెప్పక తప్పదు.