Begin typing your search above and press return to search.

నైజీరియాకు చెక్కేసిన మ‌రో నీర‌వ్ మోదీ?

By:  Tupaki Desk   |   24 Sep 2018 1:03 PM GMT
నైజీరియాకు చెక్కేసిన మ‌రో నీర‌వ్ మోదీ?
X
భార‌త్ లో ఇపుడు వైట్ కాల‌ర్ మోసాల‌కు పాల్ప‌డ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది. పెద్ద‌మ‌నుషులుగా చ‌లామ‌ణీ అవుతోన్న కొంత‌మంది ....బ్యాంకుల‌కు పంగ‌నామం పెట్టి విదేశాల్లో జ‌ల్సా చేస్తున్నారు. స్వ‌దేశానికి టోక‌రా ఇచ్చి....విదేశాల్లో విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతూ రాజ‌భోగాలు అనుభ‌విస్తోన్న ఆ `పెద్ద‌`మ‌నుషుల‌ను భార‌త్ ర‌ప్పించేందుకు ప్ర‌భుత్వం ఆప‌సోపాలు పడుతోంది. వారిని భార‌త్ కు ర‌ప్పించ‌డంలో స‌ర్కార్ విఫ‌ల‌మ‌వ‌డాన్ని అలుసుగా తీసుకున్న మ‌రికొంద‌రు అదే త‌ర‌హాలో బ్యాంకుల‌కు `రుణ‌`ప‌డి పోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలో, భార‌త్ లోని బ్యాంకుల‌కు 9 వేల కోట్లు ఎగ్గొట్టిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా.....ఎంచ‌క్కా లండ‌న్ పారిపోయి భార‌త అధికారుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ....పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు 13వేల కోట్ల రూపాయ‌లకు టోక‌రా వేసి...విదేశాల‌కు చెక్కేసిన విష‌యం విదిత‌మే. అదే కోవ‌లో తాజాగా మరో వ్యాపారవేత్త ప్రభుత్వ రంగ బ్యాంకులకు దిమ్మ‌దిరిగే షాకిచ్చాడు. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర నైజీరియాకు చెక్కేసిన‌ట్లు జాతీయ మీడియాలో వ‌స్తోన్న క‌థ‌నాలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. సీబీఐతో పాటు ఈడీ కేసులు ఉన్నప్పటికీ నితిన్ భారత్ నుంచి జంప్ కావ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.నీర‌వ్ మోదీ లాగా నితిన్ కూడా మోదీ సొంత ఇలాఖా గుజ‌రాతీ కావ‌డం విశేషం.

గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్.....ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను తీసుకున్నారు. అయితే, వాటిని ఆయ‌న‌ తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐకి ఆ క‌న్సార్టియం ఫిర్యాదు చేసింది. దీంతో, నితిన్ తో పాటు కంపెనీలో భాగస్వాములుగా ఉన్న అతడి కుటుంబ సభ్యులు పై సీబీఐ, ఈడీలు కేసు నమోదుచేశాయి. ఈ క్ర‌మంలోనే విచారణను తప్పించుకునేందుకు నితిన్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. నితిన్ ను దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆల్రెడీ నితిన్ కుటుంబం నైజీరియాకు చెక్కేసింద‌ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. 300 డొల్ల(షెల్) కంపెనీల‌లో ద్వారా దేశవిదేశాల్లోని ప‌లు అకౌంట్లలోకి ఆ 5 వేల కోట్ల‌ను అక్రమంగా మళ్లించాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.4,700 కోట్ల విలువైన స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మ‌రోవైపు, నైజీరియాలో తలదాచుకున్నారని భావిస్తున్న నితిన్ కుటుంబాన్ని భారత్ కు రప్పించేందుకు ఇంటర్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసే అవకాశముందని తెలుస్తోంది. కానీ, నైజీరియాతో భారత్ కు ఖైదీల అప్పగింత ఒప్పందం లేనందున, వీరి అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. మ‌రోవైపు, ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే ఆంధ్రాబ్యాంకు డైరెక్ట‌ర్ అనుప్ గార్గ్ - చార్ట‌ర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాతిల‌తో పాటు మ‌రికొంద‌రిపై ఈడీ కేసులు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టింది.