Begin typing your search above and press return to search.

అక్కడ మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువే

By:  Tupaki Desk   |   2 Oct 2015 5:30 PM GMT
అక్కడ మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువే
X
దేశంలో వెనుకబాటుతనానికి మారుపేరు ఆ రాష్ట్రాలు... అక్కడ అనాదిగా వస్తున్న కారణాలతో మహిళ సంఖ్య తక్కువ... స్త్రీపురుష నిష్పత్తిలోనే కాదు, మహిళల అక్షరాస్యతలోనూ ఆ రాష్ట్రాలది అట్టడుగు స్థానాలే... కానీ, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం విషయంలో మాత్రం అవి అభివృద్ధి చెందిన రాష్ట్రాల కంటే ముందున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం... జనాభా గణాంకాలు... ఎన్నికల కమిషన్ లెక్కలు ముందేసుకు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.

మహిళల జనాభా, అక్షరాస్యత పరంగా వెనుకబడిన బీహార్ - రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - పంజాబ్ వంటి రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు మాత్రం మహిళలను చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పంపిస్తున్నాయి. దేశంలో ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్న తొలి అయిదు రాష్ట్రాల్లో మహిళల సంఖ్య - అక్షరాస్యత తక్కువగా ఉంది. వాటిలో మూడు రాష్ట్రాల్లో మహిళా అక్షరాస్యత జాతీయ సగటు 64.4 శాతం కంటే బాగా తక్కువ. అయితే... మహిళల సంఖ్య పరంగా వెనుకబడిన హర్యానా - పంజాబ్ లలో వారి అక్షరాస్యత మాత్రం ఎక్కువే. అయితే... మహిళల అక్షరాస్యత పరంగా కానీ, వారి సంఖ్య పరంగాకానీ వెనుకబడిన రాష్ట్రాల్లో మహిళల రాజకీయ సాధికారత మాత్రం అధికంగా ఉండడం విశేషం.

- బీహార్ లో వెయ్యి మంది పురుషులకు 935 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు... అక్కడ మహిళల అక్షరాస్యత శాతం కేవలం 52 శాతం. కానీ అక్కడ మహిళా ఎమ్మెల్యేల శాతం మాత్రం 14. ...243 మంది ఎమ్మెల్యేలు ఉన్నబీహార్ లో 14 శాత మంది ఎమ్మెల్యేలు మహిళలే.

- రాజస్థాన్ లో 200 మంది మొత్తం ఎమ్మెల్యేలలో మహిళలు 28 మంది... అంటే 14 శాతం. అక్కడ మహిళల సంఖ్య ప్రతి వెయ్యి మంది పురుషులకు 888 మాత్రమే... వారి అక్షరాస్యత కూడా 52 శాతమే.

- మధ్యప్రదేశ్ లో వెయ్యిమంది పురుషులకు 931 మంది మహిళలే ఉన్నారు. వారి అక్షరాస్యత 59 శాతం.. కానీ, అక్కడ 230మంది ఉన్న అసెంబ్లీలో 13 శాతం మహిళా ఎమ్మెల్యేలున్నారు.

- చిన్నరాష్ట్రమైన హర్యానా అసెంబ్లీలోనూ 14 శాతం ప్రాతినిధ్యం మహిళలదే. కానీ, మహిళల సంఖ్య మాత్రం 834/1000... పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో అక్షరాస్యత మాత్రం 66 శాతం ఉంది.

- పంజాబ్ లో మహిళల సంఖ్య 895/1000.... మొత్తం 117 మందిలో మహిళా ఎమ్మెల్యేలు 12 శాతం మంది ఉన్నారు... ఇక్కడ అక్షరాస్యత బాగుంది.. 71 శాతంగా ఉంది.